Road Map: 2024లో రాష్ట్రంలో బిజెపి-జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అమిత్ షా రెండు నెలల క్రితమే తమకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చారన్నారు. నిన్న కడపలో రాయలసీమ రణభేరి నిర్వహించిన బిజెపి నేడు కర్నూలులో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్ష్యులు, ఇన్ ఛార్జ్ ల సమావేశం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ చేపట్టాల్సిన ఆందోళనా కార్యక్రమాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం సోము మీడియాతో మాట్లాడారు. బిజెపి వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతోందని, బిజెపి, జనసేన సంయుక్తంగా పోటీ చేసి 2024లో విజయం సాధించాలన్న రోడ్ మ్యాప్ ను అమిత్ షా ఇచ్చారని, ఈ దిశగా పనిచేసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.
ప్రత్యేక హోదాకు బదులుగా రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చామని, దీని ద్వారా ఏడు ప్రాజెక్టులు, గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఇచ్చామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ను ప్రత్యేక రాష్ట్రంగా పరిగణించి 90:10 నిష్పత్తి లో ప్రత్యేక సాయం కేంద్రం అందిస్తోందని చెప్పారు.
రాయలసీమ రణభేరి కి ముందు వైసీపీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారని, రణభేరి తర్వాత ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. రాయలసీమ అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, వైసీపీ మంత్రులు, చీఫ్ విప్ ప్రస్తావించిన అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సోము సవాల్ చేశారు.