Friday, October 18, 2024
HomeTrending NewsBuggana: మన విధానం దేశానికే ఆదర్శం: బుగ్గన

Buggana: మన విధానం దేశానికే ఆదర్శం: బుగ్గన

పన్నుల విధింపులో  తప్పిదాలకు ఆస్కారం లేకుండా  ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు. స్థానిక ఉత్పత్తులపై జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఎన్నెన్నో వెసులుబాట్లు తీసుకువచ్చిన ఏకైక రాష్ట్రం మనదేనని పేర్కొన్నారు.  రాజమండ్రిలో ఆర్థిక మంత్రి అధ్యక్షతన గురువారం ‘ట్రేడ్ అడ్వైజరీ కమిటీ’  సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బుగ్గున మాట్లాడుతూ పన్నులకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందుల పరిష్కారంలో ఏపీ ముందంజలో ఉందని వెల్లడించారు. ట్రెజరీ అడ్వైజరీ కమిటీ నిర్వహణ, మానవతప్పిదాలపై స్పందన, పన్ను విధింపులు, వసూళ్లపై అధికారులకు సరైన శిక్షణ లేకపోవడం వలన వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు గత ప్రభుత్వంలో  అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని గుర్తు చేశారు. వాటికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వాణిజ్యవేత్తలకు స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరిచిందన్నారు.

బ్రిటీష్ కాలంలోని చింతచెట్టు చట్టం ప్రకారం,  పెరట్లో చింత చెట్టు సహా ఎక్కడ  ఏ చింత చెట్టును కొట్టివేయాలన్నా  కలెక్టర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధన ఉండేదని అలాంటి చింతపండుపై పన్ను విధింపు సరికాదని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోగలిగామని గుర్తు చేశారు. చింతపండు, మామిడిపండు, గుజ్జు , ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ సహా అనేక స్థానిక ఉత్పత్తులపై  పన్ను మినహాయింపులు, సంస్కరణలు, పన్ను తగ్గింపులు,సవరణలు, ఫిట్ మెంట్ లు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి గర్వపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఢిల్లీలో ఇటీవల పన్నుల విధానం, సంస్కరణలపై ఏపీ ఇచ్చిన  ప్రజంటేషన్ చూసి ఆంధ్రప్రదేశ్ పనితీరులో అన్ని రాష్ట్రాల కన్నా ముందుందని కేంద్ర ఆర్థిక శాఖ మెచ్చుకున్న విషయాన్ని మంత్రి వివరించారు.గతంలో అధికారులకు కోపమొస్తే, వ్యాపారవేత్తతో స్నేహాన్ని బట్టి ‘సీవీటీ’లు జరిగేవన్నారు. కానీ ఇపుడు ‘సీవీటీ’ జరగాలంటే ప్రధాన కార్యాలయానికి సమాచారం లేకుండా జరగని పారదర్శక విధానం ఏపీలో తీసుకువచ్చామన్నారు.డిపార్ట్ మెంట్ కు డీలర్ కు మధ్య మంచి సంబంధాలుండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.పన్నుల అమలు విషయంలో డీలర్ ఫ్రెండ్లీగా ఉండాలనేదే సీఎం జగన్ మార్గనిర్దేశం చేశారని బుగ్గన వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్