తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గానీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఏపీ ప్రభుత్వానికిగానీ ఎటువంటి సంబంధం లేదని సమాచార-పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి శ్రీ పేర్ని వెంకట్రామయ్య(నాని) స్పష్టం చేశారు. ఈ ఎనికల్లో తాము ఏ వ్యక్తినీ లేదా వర్గాన్ని సమర్ధించడం లేదని తేల్చి చెప్పారు.
ఈనెల 10వ తేదీన మా ఎన్నికలు జరగనున్నాయి. మా అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ పడుతున్నారు. వీరిద్దరూ తమ ప్యానెళ్ళను బరిలోకి దించారు. ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ మంచు విష్ణుకు మద్దతు తెలిపారు. కాగా, సిఎం జగన్ తో విష్ణు కుటుంబానికి బంధుత్వం ఉంది. తనకు కెసియార్ కూడా బాగా పరిచయమని విష్ణు ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు. దీనికి ప్రకాష్ రాజ్ అభ్యంతరం తెలుపుతూ, మా ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఎందుకు లాగుతున్నారంటూ మండిపడ్డారు.
ఈ విషయమై గందరగోళం నెలకొని ఉండడంతో ఓ వీడియో సందేశం ద్వారా స్పష్టత ఇచ్చారు పేర్ని నాని.