Monday, January 20, 2025
HomeTrending NewsIT raids: ఇంకో రెండు పార్ట్ లు ఉంటాయి: మల్లారెడ్డి

IT raids: ఇంకో రెండు పార్ట్ లు ఉంటాయి: మల్లారెడ్డి

తనపై ఐటి దాడులు కొత్త కాదని.. ఇది మూడోసారి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. కానీ ఒకేసారి ఇంతమంది వచ్చి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించడం ఇదే తొలిసారి అని అన్నారు. ఇప్పుడు జరిగింది పార్ట్ 1 మాత్రమేనని, పార్ట్ 2, 3 కూడా ఉంటాయని, తాను అన్నిటికీ సిద్ధంగా  ఉన్నానని ప్రకటించారు. 2008 ఐటి దాడుల్లో తన భార్య, కోడళ్ళకు చెందిన బంగారం తీసుకు వెళ్లి ఇప్పటి వరకూ ఇవ్వలేదన్నారు.  ఐటి అధికారులను తాను దూషించినట్లు వచ్చిన వార్తలను మల్లారెడ్డి ఖండించారు. తన కుమారుడు ఆస్పత్రిలో చేరితే కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వలేదని, తన భార్య ఆవేదన చూడలేక తాను ఆస్పత్రికి వెళ్తానని పట్టుబట్టానని వివరించారు.

పెద్ద విద్యా సంస్థలను నెలకొల్పి వేలాదిమందిని ఇంజనీర్లు, వైద్యులుగా తయారు చేస్తున్న చరిత్ర ఉందని,  సేవాభావంతో నెలకొల్పిన సంస్ధలపై దాడులు చేసి ప్రొఫెసర్లు, ప్రిన్సిపల్స్, స్టాఫ్, ఆఖరికి క్లర్క్ లను కూడా వదిలి పెట్టకుండా వారి ఇళ్ళల్లో కూడా సోదాలు చేయడం ఎంతవరకూ సమంజసమని మంత్రి నిలదీశారు. తాను చాలా సాధారణ జీవితం గడుపుతానని తనది ‘సింపుల్ లివింగ్- హై థింకింగ్ – లో ప్రొఫైల్’ అంటూ వ్యాఖ్యానించారు.

సిఎం కేసిఆర్ అండగా ఉన్నంతవరకూ తనకు భయం లేదని, అయన మా ధైర్యం అని అభివర్ణించారు. ఎన్ని దాడులు జరిగినా తనను గానీ, కేసిఆర్ ను గానీ ఎవరూ ఏమీ చేయలేరని మల్లారెడ్డి స్పష్టం చేశారు. బిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని, కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, కేసిఆర్ ప్రధానమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.  టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకే తాను ఇంతగా బద్నాం చేశారని ఆరోపించారు.  దాడుల్లో కేవలం 28 లక్షల రూపాయలు మాత్రమే దొరికాయని, ప్రతి రూపాయికీ ఆధారం ఉంటుందన్నారు.  దేశంలో బిజెపి పాలిత రాష్ట్రాలు 19 ఉన్నాయని, అక్కడ ఏ ఎమ్మెల్యే, మంత్రిపైన అయినా ఇలా దాడులు చేసే ధైర్యం ఉందా అని మంత్రి ప్రశ్నించారు.బిజెపిలో ఉంటె ఎలాంటి దాడులు ఉండవని, లేకపోతే రోజూ సోదాలు ఉంటాయని, తాము ఇలాంటి దాడులను ముందే ఊహించామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్