అవినీతిని తాము సమర్ధించడం లేదని, కేవలం చంద్రబాబును అరెస్టు చేసిన తీరును మాత్రమే ఖండిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అందరం చూస్తున్నామని… బాబు ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారని రేపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ పై విచారణ సమయంలో అన్ని విషయాలూ తేలతాయని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి జరిగిందా లేదా అనేది కోర్టులు తెలుస్తాయని, అది తేల్చడానికి తాము ఎవరిమని ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు.
గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు సంబంధించి తాము కొన్ని వివరాలు సేకరించామని, ఈ రెండు జిల్లాల్లో 54 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సెంటర్ కూ 100 కంప్యూటర్ లు ఇచ్చారని, జర్మనీ నుంచి తెచ్చిన సాఫ్ట్ వేర్ అప్ లోడ్ చేశారని, కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేశారని.. నైపుణ్యాభివృద్దికి కావాల్సిన సరంజామా సమకూర్చినట్లు తేలిందన్నారు. సిఐడి వారు ఈ కేంద్రాలను పరిశీలించారా, వెళ్లి విచారణ చేశారా లేదా అనేది చూడాల్సి ఉంటుందన్నారు. అవినీతి చిన్నదైనా, పెద్దదైనా అది సమర్ధనీయం కాదన్నది తన అభిప్రాయమని, ఇది తన తండ్రి ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్న విషయమని పురందేశ్వరి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతోన్న అవినీతికి కర్త, కర్మ, క్రియ ప్రభుత్వమే అని ఆమె విమర్శించారు.