విశాఖలో నిర్మిస్తోన్న ఇనార్బిట్ మాల్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు రహేజా గ్రూప్ ఛైర్మన్ నీల్ రహేజా ప్రకటించారు. విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, విశాఖ లో ఇప్పటికే షాపర్స్ స్టాప్ మాల్స్ ఉన్నాయని, రాబోయే రోజుల్లో కాకినాడ, నెల్లూరు,తిరుపతిలో కూడా మాల్స్ ప్రారంభిస్తామని వెల్లడించారు. విశాఖ నగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతోందని… ఇక్కడ ఐటి, హోటల్స్ రంగాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
హిందూపూర్ దగ్గర 350ఎకరాలలో రహేజా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ పార్క్ లో టెక్స్ట్ టైల్స్ అండ్ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ కంపెనీ లు ఏర్పాటు చేస్తామని, వీటి ద్వారా 15000 ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
విశాఖలో నిర్మిస్తోన్న మాల్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, దుబాయ్ మాల్, ఎమిరేట్స్ మాల్ లాగా రాబోయే రోజుల్లో ఇది మాల్ అఫ్ ఇండియా గా ఉంటుందని హామీ ఇచ్చారు. తమకు సహకరించిన విశాఖ పోర్ట్, ఏపీ ప్రభుత్వానికి, సిఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.