Sunday, September 29, 2024
HomeTrending Newsపేదల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?: మేరుగు

పేదల సంక్షేమంపై చర్చకు సిద్ధమా?: మేరుగు

ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిదేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంధంగా భావించిన జగన్ అందులో ఇచ్చిన ప్రతి హామీని కూడా తూచ తప్పకుండా అమలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఆర్భాటం ఎక్కువ.. అమలు తక్కువ.. అని ఆయన ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం ప్రతి పేదవాడికీ అవసరమైన సంక్షేమ పథకాలను తలుపుతట్టి మరీ అందిస్తున్నప్పుడు, చంద్రబాబు రోడ్లపై పెడుతున్న అన్న క్యాంటీన్లకు ఎవరు వస్తారని ఆయన ప్రశ్నించారు.

టీడీపీ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి పథకాలను కాగితాలకే పరిమితం చేసి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు చంద్రబాబు అన్యాయం చేసారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో  ఏ ఒక్క  పథకం కూడా అన్ని వర్గాల వారికి అందలేదని విమర్శించారు. 2017లో ఈ పథకాలలో లబ్దిదారులుగా బీసీ కులాల వారిని చేర్చినా, వారికి లబ్దిమాత్రం చేకూరలేదని ఆరోపించారు. 2018-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 17,709 మందికి ఈ సహాయం అందకుండా ఆపేసారని, తద్వారా బీసీలకు రావాల్సిన రూ.68 కోట్లను ఎగ్గొట్టారని నాగార్జున తెలిపారు.

అక్టోబరు 1 నుంచి.. మా ప్రభుత్వ అమలు చేయబోయే .. కళ్యాణమస్తు, షాదీ తోఫాల ద్వారా.. గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన దానికంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎవరి హయాంలో ఏం జరిగిందో.. బహిరంగ చర్చకు మీరు సిద్ధమేనా అని సవాల్ విసిరారు.  టీడీపీ చేస్తున్న పిచ్చి చేష్టలు, పిచ్చి ప్రేలాపలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిపై నిందలు మోపుతూ,  ఎల్లో మీడియాలో అసత్య కథనాలు రాయిస్తూ, దళితులను అడ్డు పెట్టుకుని చంద్రబాబు దుష్ట రాజకీయం చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలో ఏ దళితుడూ సహించడు అన్నారు. అంబేద్కర్ వాదులు, జగ్జీవన్ రామ్ వారసులు ఊరుకోరని, చంద్రబాబును తరిమికొడతారని నాగార్జున హెచ్చరించారు.

చంద్రబాబు నాయుడు ఎస్సీల ద్రోహి అని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీలకు భూములు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇం బ్యాలెన్స్ ఏర్పడుతుందని చెప్పిన చంద్రబాబునాయుడు అంటరానితనానికి, అట్రాసిటీకి నిదర్శనం అని మంత్రి నిప్పులు చెరిగారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్