Tuesday, March 17, 2026
HomeTrending Newsరైతుల కోసం ఢిల్లీ వచ్చాం

రైతుల కోసం ఢిల్లీ వచ్చాం

Delhi : రైతుల ప్రయోజనం కోసమే తాము ఢిల్లీకి వచ్చామని, రాజకీయం చేయడానికి రాలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి తక్షణమే తమకు సమయం ఇవ్వాలని కోరారు. వీలైనంత త్వరగా సమయం ఇచ్చి తమ గోడు వినాలన్నారు. తమను నిరీక్షించేలా చేయడమంటే తెలంగాణ రైతులను అవమానించడమే అన్నారు. మంత్రులు జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రవల్లి దయాకర్‌ రావ్‌, ఎంపీలు కేకే, నామానాగేశ్వర రావుతో కలిసి మంత్రి నిరంజన్‌ రెడ్డి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. వానాకాలం ధాన్యం కొనుగోలుపై స్పష్టత కోసమే ఢిల్లీ వచ్చామని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి సమయం ఇచ్చేవరకు వేచిచూస్తామన్నారు.
గత యాసంగిలో కేంద్ర ఇచ్చిన టార్గెట్‌ ఎంత, కొన్నది ఎంత అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన టార్టెట్‌ను పెంచాలని గతంలోనే కోరామన్నారు. వరి ధాన్యం కోసం ఆరు వేలకుపైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వానాకాలంలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 42 లక్షల మెట్రిక్‌ టన్నుల టార్గెట్‌ ఇచ్చిందని, 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉందన్నారు. ఇంకా కొన్ని జిల్లాల్లో వరి కోతలే జరగలేదని, జనవరి 15 వరకు వరి కోతలు ఉంటాయని, 5 లక్షల ఎకరాల్లో వరి కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. నేటితో కేంద్రం ఇచ్చిన వరి ధాన్యం కొనుగోలు టార్గెట్‌ పూర్తవుతుందని చెప్పారు.
రాబోయే ధాన్యాన్ని కేంద్రం కొంటుందో లేదో చెప్పాలని, ఎంత ధాన్యం వస్తే అంత కొంటామని కేంద్రం రాతపూర్వకంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంతో ఇప్పటికే చేదు అనుభవాలు ఉన్నాయన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయంలో ఉన్నారని చెప్పారు. వానాకాలం కొనుగోళ్లతో యాసంగిని ముడిపెడుతూ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇతర దేశాలకు ఎగుమతిపై రాష్ట్రాలకు అధికారం ఉండదని చెప్పారు.
వానాకాలంలో 60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యమే కొంటామన్నారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. 90 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని తాము కోరామని చెప్పారు. బియ్యం మిల్లింగ్‌ తరువాత తరలించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు.

Also Read :  రైతు క్షేమం ఆలోచించండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular