Saturday, January 18, 2025
HomeTrending Newsపర్యాటక అభివృద్ధికి నిధులు: కిషన్ రెడ్డి

పర్యాటక అభివృద్ధికి నిధులు: కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి వల్లే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిశాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి వెల్లడించారు. రామప్ప ఆలయంలో మౌలిక వసతులు పెంచుతామని, వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అయన హామీ ఇచ్చారు. నేడు రామప్ప ఆలయాన్ని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్యే సీతక్క, టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌ గుప్తా, ఇతర నేతలతో కలిసి కిషన్ రెడ్డి సందర్శించారు. రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహంచి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలన్నింటికీ నిధులు కేటాయిస్తామని, ఉడాన్ పథకం ద్వారా మామునూర్ విమానాశ్రయాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. రామప్ప ఆలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని, జోగులాంబ ఆలయానికి నిధులు కేటాయించి వసతులు మెరుగుపరుస్తామని తెలిపారు. గోల్కొండ కోట, చార్మినార్ వంటి ప్రాచీన కట్టడాలను కూడా అభివృద్ధి చేస్తామని భరోసా ఇచ్చారు. కరోనాతో పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయిందని, వైరస్ అదుపులోకి రాగానే విదేశీ పర్యాటకులను అనుమతిస్తామని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 75 పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, దీనితో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని కిషన్ రెడ్డి వివరించారు.

రామప్ప ఆలయం, చెరువులు కాకతీయుల చరిత్రకు తార్కాణంగా నిలుస్తాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస గౌడ్ అన్నారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు రావడంలో సిఎం కేసియార్, అధికారులు ఎంతగానో కృషి చేశారని, దాదాపు 20 సార్లు యునెస్కో సమావేశాల్లో అర్ధరాత్రి వరకూ పాల్గొన్నారని, వారికి కావాల్సిన సమాచారాన్ని అప్పటికప్పుడు అందించారని గుర్తు చేశారు. కిషన్ రెడ్డి కూడా  కేంద్ర ప్రభుత్వం తరఫున కృషి చేశారని శ్రీనివాస గౌడ్ కొనియాడారు. రామప్ప దేవాలయంతోపాటు వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట. గోల్కొండ కోట, సోమశిలకు కూడా గుర్తింపు రావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి సహకరించాలని కిషన్ రెడ్డిని శ్రీనివాస గౌడ్ కోరారు. యాదాద్రి, రామప్ప, మన్యంకొండ, కాళేశ్వరం రిజర్వాయర్ లను కలుపుటూ కాకతీయ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని అయన వెల్లడించారు. రామప్ప ఆయలయంలో మౌలిక వసతులు మరింతగా పెంచాలని ఎమ్మెల్యే సీతక్క కేంద్ర, రాష్ట్ర మంత్రులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్