మాల-మాదిగల పేర్లతో ఎస్సీల్లో వర్గ విభేదాలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, కానీ తమ పార్టీకి అందరూ ముఖ్యమేనని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఏ ఒక్క వర్గాన్నీ తాము నిర్లక్ష్యం చేసే ప్రసక్తే లేదన్నారు.వేమూరు, రేపల్లె నియోజకవర్గాలకు చెందిన టిడిపి, ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయసాయి మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం మరోసారి మతతత్వ పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతోందని ఆరోపించారు. ఒంటరిగా పోటీ చేయాలనేదే తమ పార్టీ విధానంగా ఉందని.. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. పేదరిక నిర్మూనల కోసం తాము అమలు చేస్తున్న పథకాలు కొనసాగాలంటే సిఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని, ఇదే విషయాన్ని అందరూ ప్రజలకు తెలియజెప్పాలని విజయసాయి విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్ళ కాలంలో తాము ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే కేంద్ర సహకారం కావాలని, అందుకే తాము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అంశాల్లో మద్దతు ఇచ్చామని, సెక్యులర్ భావాలకు విరుద్ధంగా ఉన్న బిల్లులకు తాము మద్దతు ఇవ్వలేదని… ట్రిపుల్ తలాక్ కు తాము అనుకూలంగా ఓటు వేయలేదని గుర్తు చేశారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అవసరమని, రాష్ట్ర అభివృద్ధి కోసమే కేంద్రంతో సఖ్యతగా ఉన్నామని, కానీ ఎప్పుడూ ఆ పార్టీతో పొత్తులో లేమని వివరించారు.