పవన్ కళ్యాణ్ బెదిరించగానే వణికిపోయే ప్రభుత్వం తమది కాదని, ఇలాంటి ఉడుత ఊపులకు భయపడే ప్రశ్నే లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. తమకు ప్రజలు, భగవంతుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. జగన్ ను భయపెట్టగలిగినవాడు, బెదిరించేవాడు ఇంతవరకూ భూమి మీద పుట్టలేదని పవన్ కు, మీడియాకు చెబుతున్ననంటూ నాని వ్యాఖ్యానించారు.
పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించి సినిమా ఇండస్ట్రీని దెబ్బతీయాల్సిన అవసరం సిఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని నాని అన్నారు. కేవలం నలుగురు హీరోలు, నలుగురు నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వం పనిచేయదని, అందరినీ దృష్టిలో పెట్టుకొనే, అన్ని సినిమాలనూ బతికించే దిశలోనే పనిచేస్తుందని తేల్చి చెప్పారు. సినిమాను నమ్ముకుని బతికే చివరి వ్యక్తి లైట్ బాయ్ నుంచి నిర్మాత వరకూ అందరూ బాగుండాలన్నదే తమ అభిమతమన్నారు. హైకోర్టు తీర్పు ప్రకారమే ప్రభుత్వం ఓ కమిటీని నియమించి ఆ నివేదిక ప్రకారం ఏయే సెంటర్లలో ఏయే రెట్లు ఉండాలో జీవో ఇచ్చామని తెలిపారు. ఇష్టారాజ్యంగా టిక్కెట్లు పెంచడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని వెల్లడించారు. గత ప్రభుత్వం కొంతమందికి లొంగిపోయి, కొంతమందికి లాభాలు కలిగించాలనే దురుద్దేశంతో విధానపరమైన నిర్ణయాలు సరిగా తీసుకోలేదని నాని గుర్తు చేశారు. అందుకే నిర్మాతలు కోర్టుకు వెళ్ళారన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఆడడం వల్లో, సరిగా ఆడకపోవడం వల్లో ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏముంటుందని నాని ప్రశ్నించారు.
ఖచ్చితంగా ఏపీలో సినిమా షూటింగ్ జరపాలన్న నిబంధన తాము విధించలేదని, షూటింగ్ లకు కావాల్సిన సౌకర్యాలు కావాలంటూ దర్శక నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరితే దానిపై సానుకూలంగా స్పందిస్తామని కొడాలి హామీ ఇచ్చారు.