Saturday, January 18, 2025
HomeTrending Newsమేం పేదవాళ్ళకు టిక్కెట్లు ఇచ్చాం: వైఎస్ జగన్

మేం పేదవాళ్ళకు టిక్కెట్లు ఇచ్చాం: వైఎస్ జగన్

తమ ఐదేళ్ళ పాలనలో విద్యారంగంలో తీసుకువచ్చిన మార్పులకు ఎంతో గర్వపడుతున్నానని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామని.. నాడు-నేడుతో మౌలిక వసతులు కల్పించామని…అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుకలాంటి పథకాలతో ప్రభుత్వ విద్యను ప్రోత్సహించామని వివరించారు. పేదరికం నుంచి బైట పడాలంటే పిల్లలు మంచిగా చదువుకోవాలని, కానీ పేద పిల్లల చదువుల గురించి గతంలో ఏ పాలకుడూ పట్టించుకోలేదని.. అలాంటి పాలకులు ఉన్నా ఒకటే… లేకపోయినా ఒకటే అని వ్యాఖ్యానించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని చేనేత గ్రౌండ్స్ లో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.

శింగనమల వైసీపీ అభ్యర్ధిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. నేడు అక్కడ జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు ఓ టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే సీటు ఇచ్చారంటూ హేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకు సీట్లు ఇచ్చిందని, ఇది పేదవారి పార్టీ అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభ్యర్ధి వీరంజనేయులు బాబు కంటే ఎక్కువే చదువుకున్నారని… ఎంఏ ఎకనామిక్స్ చదివి ఆ తర్వాత బిఈడీ కూడా పూర్తి చేశారని వివరించారు. కానీ బాబు పాలనలో ఉద్యోగం దొరక్క టిప్పర్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు.  మడకశిర టిక్కెట్ ను కూడా ఓ ఉపాధి హామీ కూలీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్కప్పకు ఇచ్చామని, బాబు రేపు అక్కడకు వెళ్లి కూడా హేళన చేస్తారేమో అంటూ జగన్ అన్నారు.

కర్నూలు నుంచి హఫీజ్ ఖాన్ కు టిక్కెట్ ఇవ్వలేకపోయానని, కానీ రెండేళ్లలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఎంపిగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:

  • సామాజిక న్యాయంలో సువర్ణాధ్యాయం లిఖించాం
  • ఇంగ్లీష్ మీడియం వద్దని అడ్డుకున్నవారికి.. పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అడ్డుకున్న వారికి బుద్ధి చెప్పండి
  • ఎస్సీలను అవమానించిన వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా చేయండి
  • బిసిల తోకలు కట్టిరిస్తామన్నవారి తోక కత్తిరించండి
  • మైనార్టీల మనోభావాలు దేబ్బతీస్తున్నవారికి బుద్ధి చెప్పండి
  • చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు, ఈ ఎన్నికల్లో కూడా దత్తపుత్రుడిని, ఢిల్లీ నుంచి మోడీని తెచ్చుకున్నారు
  • రైతు వ్యతిరేక కూటమితో మనం యుద్ధం చేస్తున్నాం
  • 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ చంద్రబాబు నెరవేర్చలేదు
  • మరోసారి మోసం చేసేందుకు బాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు.
  • గతంలో హామీలిచ్చి మోసం చేసిన బాబు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటూ వస్తున్నారు
  • ఇలాంటి మోసగాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి
  • మోసగాళ్ళ నుంచి రాష్ట్రాన్ని కాపాడు కోవడానికి మేనంతా సిద్ధం, మీరు సిద్ధమేనా?
  • పేదవాడి భవిష్యత్ కోసం యుదానికి నేను సిద్ధం, మీరు సిద్ధమేనా?
  • కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలతో వస్తున్న బాబుతో యుద్ధానికి మీరంతా సిద్ధం కావాలి
  • రాష్ట్ర రూపురేఖలు మార్చేందుకు మనమంతా సిద్ధమవుదాం
  • ఓటుతో మన తలరాతను మనమే రాసుకుందాం
  • మంచి చేయడంలో ఎక్కడా వెనక్కు తగ్గలేదు, 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపి సీట్లు రెండూ కలిపి 200 సీట్లు ఎక్కడా తగ్గ కూడదు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్