Sunday, January 19, 2025
HomeTrending Newsఅక్వాకు చేయూత అందించాం: ముదునూరి

అక్వాకు చేయూత అందించాం: ముదునూరి

ఆక్వా రంగం మీద దృష్టి పెట్టి, చేయూత ఇచ్చిన ఘనత సిఎం జగన్ నేతృత్వంలోని తమ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు స్పష్టం చేశారు.  దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయ్యే ఆక్వాకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు.  రొయ్యలు, చేపల రైతులకు ఎక్కువ ఖర్చు ఫీడ్ మీదే అవుతుందని, వీరికి గత ప్రభుత్వాలు ఎలాంటి భరోసా ఇవ్వలేకపోయాయని, పాదయాత్ర సందర్భంగా సబ్సిడీపై విద్యుత్ అందిస్తామని  జగన్ హామీ ఇచ్చారని, ఈ మేరకు అధికారంలోకి రాగానే రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్ అందిస్తున్నామని వివరించారు.  తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రసాదరాజు మీడియాతో మాట్లాడారు.

సబ్సిడీపై విద్యుత్ ఇవ్వడం ద్వారా ఆక్వా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గిందని, కొత్తగా చెరువులు తవ్వుకునేందుకు అనుమతులు, ఫిషరీస్ సర్టిఫికేట్ కూడా అందిస్తూ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.  రైతులకు నాణ్యమైన సీడ్, ఫీడ్ అందించేందుకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, గిట్టుబాటు ధర కూడా స్థిరంగా ఉండేట్లు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.  అమెరికా, చైనా దేశాలు ఆక్వా ఎగుమతులు ఆశించినంతగా చేసుకోలేదని, అందుకే మార్కెట్ అప్ అండ్ డౌన్ అయ్యిందని, ఈక్వెడార్ లో ఈ సాగు అధికంగా చేస్తూ ,  వారు మనకన్నా తక్కువ ధరకే అందిస్తున్నారని…  అందుకే మన రైతులకు ఇబ్బంది కలిగిందని ముదునూరి  చెప్పారు.  సిఎం జగన్ వెంటనే స్పందించి ఆక్వా రైతుల సమస్యలపై సీనియర్ మంత్రులతో ఓ కమిటీ వేశారని, స్థిరంగా ధర నిర్ణయించి రైతులకు నష్టం రాకుండా చేశారన్నారు.  తమ ఉత్పత్తులను రైతులు నిల్వ చేసుకునేందుకు వీలుగా ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.

గత ప్రభుత్వం కనీసం వంద కోట్లు కూడా ఖర్చు చేయలేదని, కానీ తమ ప్రభుత్వం 546 కోట్ల రూపాయలతో 10 ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, 50 కోట్లతో ఆక్వా లాబ్ లు ఏర్పాటు చేసిందన్నారు. 2,377 కోట్ల రూపాయల విద్యుత్ సబ్సిడీని చేపల, రొయ్యల రైతులకు అందించిందని ప్రసాదరాజు వివరించారు.

తమ విధానాలతో కొన్ని కార్పొరేట్ సంస్థలకు తప్ప 86 శాతం ఆక్వా రైతులకు మేలు చేకూరిందని, కానీ తెలుగుదేశం నేతలు అనవసరంగా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది వ్యాపారులు సిండికేట్ అయ్యి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, వీరంతా చంద్రబాబు శిష్యులేనని మండిపడ్డారు.

Also Read ఆక్వా రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోం: సిఎం వార్నింగ్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్