Wednesday, May 7, 2025
HomeTrending Newsసుస్థిర ప్రగతి, అసమానతలపై దృష్టి: సిఎం

సుస్థిర ప్రగతి, అసమానతలపై దృష్టి: సిఎం

Azadi ka Amrit Mahotsav: సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక,  శాస్త్రసాంకేతిక రంగాల్లో మన ప్రగతిని అవలోకనం చేసుకోవడానికి అమృత్‌మహోత్సవ్‌ వేదిక కల్పిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 75 సంవత్సరాల్లో మన దేశం సాధించిన ప్రగతిని గుర్తుచేసుకోవడానికి,  భవిష్యత్తులో మరింత ప్రగతి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మన అంకితభావాన్ని పునరుద్ఘాటించడానికి ఈ ఉత్సవ్  స్ఫూర్తి ఇస్తోందని అయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.  వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పార్టీల నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయం నుంచి సిఎం జగన్ కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొని ప్రసంగించారు.

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న చర్యల్లో ఆజాదీ కా అమృత్‌మహోత్సవ్‌ అత్యంత ప్రశసంసనీయమైనదని సిఎం జగన్ కొనియాడారు. ‘స్వతంత్ర పోరాటయోధుల నిస్వార్థతను చూసి మనం అంతా గర్వించాలి. అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా వారిని గౌరవించుకోవాలి, వారికి సెల్యూట్‌ చేయాలి. ఏపీలో స్వాతంత్య్ర సమరయోధులను ఈ సందర్భంగా గౌరవించుకునే అవకాశం నాకు కలిగింది. ఆజాదీ క అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్యగారి కుమార్తె శ్రీమతి సీతా మహాలక్ష్మిగారిని వారి స్వగ్రామంలో కలుసుకున్నాను. జాతీయ పతాకాన్ని శ్రీ పింగళి వెంకయ్యగారు రూపొందించారు. 1921లో ఆయన తాను రూపొందించిన పతాకాన్ని మహాత్మగాంధీకి విజయవాడలో సమర్పించారు. ప్రస్తుతం ఇది బాపు మ్యూజియంలో ఉంది. మా ప్రభుత్వం ఇటీవలి కాలంలో ఈ మ్యూజియంను బాగుచేసి ప్రజల సందర్శనార్థం అందుబాటులోకి తీసుకువచ్చింది” అని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ అల్లూరి సీతారామరాజు, శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, శ్రీ ఆంధ్రకేసరి ప్రకాశం పంతులుగారు, శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు, శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు, శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు మరెంతో మంది ప్రముఖులు సేవలను గుర్తుచేసుకుంటూ ప్రతివారం వర్చువల్‌ గా, భౌతికంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకూ 908 కార్యక్రమాలు నిర్వహించామని వివరించారు. నిస్వార్థపరులైన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుచేసుకోవడమే కాకుండా వారిజీవితాలనుంచి ఈ తరం యువకులు స్ఫూర్తిని పొందుతున్నారని సిఎం అన్నారు. ఈ కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయడం ద్వారా వారిలో దేశభక్తిని నింపుతున్నామన్నారు.

ఈ పరిస్థితుల్లో మనం నడుస్తున్న మార్గంలో అనేక అవకాశాలూ ఉన్నాయని, మరోవైపు అనేక సవాళ్లు కూడా ఉన్నాయని, మన దేశ సమర్థతను చాటడానికి  సుస్థిర ప్రగతి… ఆర్థిక అసమానతలను తొలగించడం… ఈ రెండు అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంధన రంగంలో సమూల మార్పులు రావాలని, సంపూర్ణంగా క్లీన్‌ ఎనర్జీ దిశగా అడుగులు వేయాలని, ఒన్‌ సన్‌.. ఒన్‌ వరల్డ్‌… ఒన్‌ గ్రిడ్‌ కల సాకారం కావాలని సిఎం జగన్ ఆకాంక్షించారు.

Also Read : ప్రధానితో వైసీపీ ఎంపీల భేటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్