రాబోయే ఎన్నికలు విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న ఈ యుద్ధమని దీనిలో వంచకుల్ని, వెన్నుపోటు దారులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా అని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలనుద్దేశించి అడిగారు. ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి, వాలంటీర్లు మళ్లీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్తు మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా, మన బడులు, మన పిల్లలు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, హాస్పటళ్లు బాగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాను గుర్తుమీద రెండు బటన్లు నొక్కాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.
“చంద్రబాబునాయుడును నమ్మితే మాత్రం బంగారు కడియం, పులి కథే గుర్తుపెట్టుకోండి. ఇన్ని అబద్ధాలు, ఇన్ని మోసాలతో రాష్ట్ర పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ ఒక స్టార్ క్యాంపెయినర్ గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి నిజాలు చెప్పి వారిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా మార్చడానికి మీరంతా కూడా సిద్ధమేనా?” అని జగన్ ప్రశ్నించారు. గత ఐదేళ్లుగా పేదలకు తాము చేస్తున్న మంచిని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలని, ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు, కుటుంబాలు బాగుపడతాయన్నది వివరించాలని సూచించారు.
“నేను అడుగుతున్నాను, ఏ గ్రామమైనా తీసుకోండి. కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా మీ ఇష్టం. ఏ గ్రామమైనా తీసుకోండి. ఆ గ్రామంలో ఇవాళ మనం చెబుతున్న ప్రతి మాటా కూడా కళ్ల ఎదుటే కనిపిస్తోంది. అదే గ్రామంలో ఒక సచివాలయ వ్యవస్థ, ఇంటికే వచ్చే వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకే, విలేజ్ క్లినిక్, మారిన ఇంగ్లీషు మీడియం స్కూలు, మహిళా పోలీస్, ప్రతి అక్కచెల్లెమ్మ ఫోన్లో ఓ దిశ యాప్, గతంలో మాదిరిగా కాకుండా ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా ఏ గ్రామాన్ని తీసుకున్నా నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకే అందజేస్తున్న అదే గ్రామానికి చెందిన ఓ వాలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు.. వీరందరికీ పైన మీ బిడ్డ జగన్ ముఖ్యమంత్రిగా మంచి చేస్తూ కనిపిస్తున్నాడు” అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.