Wednesday, May 7, 2025
HomeTrending Newsసెప్టెంబర్ నాటికి రాష్ట్రమంతటా అమూల్ :సిఎం

సెప్టెంబర్ నాటికి రాష్ట్రమంతటా అమూల్ :సిఎం

Jagananna Paala velluva: వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ట్రంలోని 17,629 గ్రామాల నుంచి అమూల్ సంస్థ పాలు సేకరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నామని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.  కృష్ణాజిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. పాడి రైతులకు…ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదిశగా అడుగులు వేశామని, అందుకే అమూల్‌ని తీసుకొచ్చామని వివరించారు. అమూల్‌  సంస్ధ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో 245, చిత్తూరు జిల్లాలో  275, వైయస్సార్‌ జిల్లాలో 149, గుంటూరులో 203, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి ఇప్పటికే పాలసేకరణ చేస్తోందని, ఈరోజు నుంచి కృష్ణా జిల్లాలో 264 గ్రామాలలో పాలవెల్లువ ద్వారా పాలసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఇదొక చారిత్రక ఘట్టమని, ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నందుకు సబర్‌ కాంత మిల్క్‌ యూనియన్‌ ఎండీ డాక్టర్‌ బీ ఎం పటేల్‌ కు జగన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

గత ఏడాది డిసెంబరు లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా ఏడాదిలోగానే ఆరు జిల్లాల్లో పాడిరైతులకు, అమూల్ ద్వారా సేవలు అందుతున్నాయని, రాబోయే రోజుల్లో మిగిలిన 7 జిల్లాలలో విస్తరిస్తామని సిఎం జగన్ చెప్పారు.  ఐదు జిల్లాలలో ఇప్పటివరకు 30,951 మంది మహిళా పాడిరైతుల నుంచి 168.50 లక్షల లీటర్లు పాలసేకరణ అమూల్‌ చేసిందని, దాదాపు రూ.71 కోట్లు చెల్లించామని, ఇతర డెయిరీలకు పాలసరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది గమనించాల్సిన అంశమని పేర్కొన్నారు.

మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, పాలవెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్ధాయిలోనే ఆర్ధిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారితకు ఊతమిస్తోందని జగన్ చెప్పారు.

ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ, పశుసంవర్ధశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఏపీడీడీసీఎఫ్‌) ఎండీ ఎ బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌ అమరేంద్రకుమార్, అమూల్‌ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Also Read : కిడాంబి శ్రీకాంత్ కు జగన్ అభినందన

RELATED ARTICLES

Most Popular

న్యూస్