21.3 C
New York
Thursday, October 5, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశంఖంలో పోస్తేనే తీర్థం

శంఖంలో పోస్తేనే తీర్థం

Our Health- Our Medicine:

ఉపోద్ఘాతం:-
ప్రాచీన భారత వైద్య విధానాలను ముఖ్యంగా గృహవైద్యం, అనువంశిక వైద్యం, వేదోక్త ఆయుర్వేద వైద్యం అని మూడు విధాలుగా వర్గీకరించవచ్చు. నిజానికి మొదటి రెండూ కూడా వేదోక్తాలే.

గృహ వైద్యం:-
రోజూ వంటింట్లో వాడే వ్యంజనాలతో చాలా ప్రాథమిక దశలో ఉన్న చిన్న చిన్న ఋతు మార్పు ప్రభావిత వ్యాధులకి (మామూలుగా ఆరోగ్యవంతులకి)  చేసే త్వరిత చికిత్స. ఉదా: పసుపు, తులసి, దాల్చిన చెక్క, అల్లం, కరక్కాయ, నిమ్మ కాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, మొదలగునవి అమ్మమ్మ వైద్యం. మన పూర్వీకులు వేదశాస్త్ర ప్రమాణంగా, శాస్త్ర పరిజ్ఞానం లేని సామాన్య గృహిణులు గూడా త్వరితగతిన వంటింట్లో అప్పటికప్పుడు తయారు వైద్య విధానాన్ని రూపొందించారు. దీనివల్ల మామూలు జలుబుకు కూడా వైద్యుణ్ణి సంప్రదించే దుస్సాంప్రదాయం ఆ కాలంలో లేదు.

అనువంశిక వైద్యం:-
ప్రతి ఊర్లో ఒకటో రెండో కుటుంబాలు వంశ పారంపర్యంగా తమ పూర్వీకుల నుండి నేర్చుకుంటూ కొన్ని (అన్నీ కాదు) దీర్ఘ కాలిక రోగాలకు వారి వారి అనుభవం ద్వారా కొన్ని మూలికలతో (అందులో కొన్ని రోజూ వంటింట్లో ఉపయోగించే వ్యంజనాలు కూడా ఉనడవచ్చు) అతి గోప్యమైన పద్ధతిలో కలిపి రోగికి అందించడం. ఇందులో శాస్త్ర పరిజ్ఞానం కన్నా అనుభవం ముఖ్యం. అలా అని అనువంశిక వైద్యాలన్నీ అశాస్త్రీయం అనుకోవడం పొరపాటు. కొన్ని తరాల క్రింద తమ పూర్వీకులు శాస్త్ర జ్ఞానంతో రూపొందించిన ఔషధాన్ని వంశపారంపర్యంగా ఉపయోగిస్తూ సమాజసేవ చేస్తున్న అనువంశిక వైద్యులను కేవలం ఈ తరానికి శాస్త్రజ్ఞానం లేదని దాన్ని కేవలం నాటువైద్యంగా మాత్రమే పరిగణించకూడదు.  1000 కేసుల్లో సఫలమయ్యి ఒక్క కేసులో రోగికి నష్టం జరిగినా జనాలు తిరగబడి వైద్యుడిని చితక బాదిన సందర్భాలు కోకొల్లలు.

ఆయుర్వేదం:-
ఉపవేదమైన ఆయుర్వేదం. మన ఋషులు (ఆ కాలపు శాస్త్రజ్ఞులు) ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, తపస్సు (Research) చేసి దర్శించి రూపొందించిన వైద్య విధానం. ఆయుర్వేదంలో చాలా సంహితలు ఉన్నాయి. ఒక్కో ఋషి వారు దర్శించిన ప్రకారం సంహితలు రూపొందించారు. ఉదా: సుశ్రుత సంహిత, పరాశర సంహిత మొదలగు సంస్కృతం బాగా తెలిసి, అన్నీ కాకున్నా కొన్ని సంహితలైనా చదివి క్షుణ్ణంగా అర్థం చేసుకొని, ఆయా సంహితల్లో నిర్వచించిన ఔషధాలకు కావలసిన వ్యంజనాలను నిర్దేశించిన పద్దతిలో సేకరించి నిర్దేశించిన నిష్పత్తిలో కలిపి నిర్దేశించిన పద్దతిలో తయారు చేసి రోగికి నిర్దేశించన మోతాదులో నిర్దేశించిన పద్దతిలో ఇవ్వడంతో రోగికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. ఆయుర్వేదానికి మూల సూత్రం – మన శరీరం లోని ప్రతి ధాతువులో ప్రతి అవయవం (బాహ్య & అంతర్గత) లో కఫ, వాత,  పిత్తాలు (KVP) సమతుల్యంగా ఉంచటం.

అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుడు నాడీ పరీక్ష ద్వారా శరీరంలోని వివిధ ధాతువుల్లో వివిధ ఆవయవాల్లో కఫ, వాత,  పిత్తాలు అంచనా వేసి వాటిని సమతుల్యం చేయటానికి ఏయే ఔషధాలు ఎంతెంత, ఎప్పుడెప్పుడు, ఎలా ఇవ్వాలో నిర్ణయించి (This is called Drug Administration in Allopathy) చికిత్స చేస్తాడు. ఆయుర్వేద చికిత్సలో భాగంగా నిర్దిష్టమైన ఆహారం (Diet Plan); భౌతిక వ్యాయామం (Physio Therapy) కూడా నిర్దేశించబడి ఉన్నది. ఆయుర్వేదంలో దీర్ఘకాలిక రోగాలకి, ఋతు సంబంధ వ్యాధులకి, ప్రమాదంలో గాని యుద్ధాలలో గాని అయిన గాయాలకి, ఇలా ఒక మనిషి జీవితంలో ఎదురయ్యే దాదాపు అన్నీ ఆరోగ్య సమస్యలకి చికిత్స చాలా వివరంగా సశాస్త్రీయంగా నిర్వచించబడి ఉన్నది. అయితే ఏ రకమైన ఆరోగ్య సమస్యలకీ ఏ సంహితలో సమాధానం ఉన్నదో తెలియడం ముఖ్యం.

అయితే వేల సంవత్సరాల క్రితం రూపొందించబడిన ఆయుర్వేద వైద్యవిధానం మధ్యలో విదేశీ దురాక్రమణ దారులనుండి తప్పించుకొని భారత స్వాతంత్ర్యానికి పూర్వం వరకు కూడా బాగానే చలామణిలో ఉండింది. కానీ స్వాతంత్ర్యానంతర భారతంలో దురుద్దేశ్యాలతో మనదైన ఆయుర్వేదాన్ని పూర్తిగా విస్మరించి, ఒక పద్ధతి ప్రకారం ఆయుర్వేదాన్ని ప్రజాబాహుళ్యం కూడా పూర్తిగా మరచిపొయ్యేట్టు చేశారు. ఆయుర్వేద విద్యకి మూల స్తంభమైన సంస్కృత భాషని విద్యా వ్యవస్థ నుండి తప్పించి అటు భారతీయ సనాతన ధర్మాన్నే కాకుండా ప్రజారోగ్య వ్యవస్థని నిర్వీర్యం చేశారు.

ఉపసంహరణ:-
కొన్ని దశాబ్దాల క్రితం మనం వదిలేసిన ఆయుర్వేదం మళ్ళీ ప్రజాబహుళ్యంలోకి తీసుకురావాలంటే కేవలం ఈ విద్య విధానంలో అన్నీ రోగాలకి చికిత్స ఉన్నది, అని Claim చేస్తే సరిపోదు. సరియైన ఆయుర్వేద విద్యా వ్యవస్థ ద్వారా నిష్ణాతులైన ఆయుర్వేద వైద్యులను తయారు చేసి, ఇప్పటికే ఆయుర్వేద గ్రంధాలలో (సంహితల్లో) ఉన్న వైద్య విధానాలను, ఔషధ తయారీ విధానాన్ని, ఔషధ ఉపయోగ విధానాన్ని (Drug Administration) సమకాలీన శాస్త్ర విజ్ఞాన ప్రాతిపదికన Clinical Trials ద్వారా, (International Technical & Medical Journals ) సంచికలలో (publish) ప్రచురణ చేయడం ద్వారా తిరిగి (re-establish ) పున: ప్రతిపాదన చేయవలసి ఉన్నది.
“తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితౌ” గీతా వాక్కు.

-రాధాకృష్ణ రేగళ్ల; సింగపూర్
+65-91126318

Radhakrishna Regalla
Radhakrishna Regalla
సింగపూరు నివాసి. వృత్తి రీత్యా అభియంత (Post Graduate Structural Engineer). సాహిత్యాభిలాషి. వేదాధ్యయనం, సంగీతం, పద్యరచన వ్యాపకాలు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

న్యూస్