Only Facts and Truths: “అన్నీ వేదాల్లో ఉన్నాయిష” ఏ ముహూర్తాన పై వాక్యాన్ని ‘కన్యాశుల్కం‘ నాటకంలో పలికించాడో గానీ.. ఆ వాక్యం ఒకానొక మనస్తత్వాన్ని తెలిపే ఫార్ములాగా మారింది. పై వాక్యాన్ని గమనిస్తే చెప్పేవాడికి వేదంలో ఏముందో తెలియదని స్పష్టమవుతుంది. అయితే అన్నీ ఉన్నాయట అనే అభిప్రాయం కూడా అతనికుంది. ఈ మనస్తత్వం ఇప్పటికీ చాలా మందిలో చూడగలం.
మన అదృష్టవశాత్తూ మనకంటే ఎక్కువగా వేదాలను ప్రపంచం ముందుకు తెచ్చినవారు పాశ్చాత్యులు. అలా లేనట్టయితే మన వేదాలు, అందులోనూ జ్ఞానానికీ, ఆలోచనకూ సంబంధించిన ఉపనిషత్తులు ఇంకా మడి కట్టుకుని ప్రజలకూ, ప్రపంచానికీ దూరంగా ఉండేవి. మొట్టమొదట మ్యాక్స్ ముల్లర్ వీటిని ప్రచురించడం వల్ల, Scared books of the East అనే శీర్షికలో మన వైదిక వాఙ్మయం అంతా ఆంగ్లంలోకి అనువాదం కావడం వల్ల అనేక మంది మేధావులు వాటిని తెలుసుకునే అవకాశం వచ్చింది. మంచి, చెడులను రెంటినీ గూర్చి వారు రాశారు.
‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అన్నది గురజాడ గారి నాటకంలోని ఒక అమాయక పాత్ర చెప్పేమాట. అలా అనుకునేవాళ్లు ఈనాటికీ కొన్ని వాదాలు చేస్తూంటారు. ఉదాహరణకు కాంతివేగాన్ని గూర్చి వేదాలు చెప్పాయనీ, సూర్యుడికీ, భూమికీ మధ్య ఉన్న దూరం గూర్చి వేదాల్లో ఉందనీ, కుజగ్రహంలో నీళ్ల గూర్చి మనకు తెలుసనీ, ఓపెన్ హైమర్ అనే శాస్త్రవేత్త అణుబాంబును పేల్చిన తర్వాత.. భగవద్గీతలోనూ అణుశక్తిని గురించిన విషయాలు ఉన్నాయనీ.. ఇలా ఎన్నెన్నో చెబుతుంటారు. వీరు చాలా వరకు సంస్కృతంలో ప్రాథమిక జ్ఞానం మాత్రమే ఉన్నవారు. పుస్తకాలను, ఆ పుస్తకాలపై ప్రాచీనులు ఎలాంటి ప్రామాణికమైన వ్యాఖ్యానాలు చేశారో చదవనివారు. వీరిని టీవీల వారు తరచుగా ఆహ్వానిస్తుంటారు. ఏదో ఒక శాస్త్రవేత్త లేదా ఆధునిక హేతువాది ఎదురుగా కూర్చోబెట్టి చోద్యం చూస్తుంటారు. ఆధునిక ప్రేక్షకులకు ఇలాంటి పండితుల వాదాలు హేతుబద్ధంగా అనిపించవు.
వేదాల్లో ఏమీ లేదని చెప్పడం కూడా అజ్ఞానంతో కూడిన మాటే. ఈనాడు శాస్త్రవేత్తలు ఒక విషయ స్వరూపాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి ఎలా ప్రయత్నిస్తారో.. ఆ కాలంలోనూ సత్యాన్ని శాస్త్రీయంగా తెలుసుకోగోరిన వారు అనేకులు. రుషులు అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించి రాసిన గ్రంథాలే వేదాలు. అందులోనూ వాటి చివరిభాగాలైన ఉపనిషత్తులు.
వేదాలను మనం నేరుగా అనువాదాల ద్వారా చదవలేమా అని ఒక ప్రశ్న. అలా చదవలేము అన్నది జవాబు. వేదాలను ఎన్నికోణాల నుంచి చదివితే సమగ్రమైన అర్థం వస్తుంది అని చెప్పడానికి ఆరుశాస్త్రాలు రాశారు. అవి భాషాశాస్త్రం ((linguistics), వ్యాకరణం ((gramar), ఛందస్సు (prosody), నిరుక్తము (వేదాల్లోని పదాలకు ఉన్న వివిధ అర్థాలు), జ్యోతిషము, కల్పశాస్త్రం అనేవి. వేదకాలం నాటి భాషాశాస్త్రాన్ని చూసేవరకు పాశ్చాత్య సంప్రదాయంలో linguistics అనేది లేదు. పాణిని అనే రచయిత చెప్పిన వ్యాకరణం నేటి భాషాశాస్త్రానికి పునాది అయింది.
జ్యోతిషం అంటే మనం అనుకునేట్టుగా నాకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుందా లేదా..? మొదలైన ప్రశ్నలకు సమాధానం చెప్పే శాస్త్రం కాదు. ఆకాశంలోని వివిధ నక్షత్రాలను, గ్రహాలను కొన్ని వేల సంవత్సరాలుగా పరిశీలించి వాటి గమనాన్ని, అవి వివిధ స్థానాల్లో ఉన్నప్పుడు భూమిపై ఏర్పడే మార్పులను గమనించి చెప్పిన శాస్త్రం. అందుకే జ్యోతిషంలో రెండు విభాగాలు 1. గణితం, 2. ఫలభాగం. గణితభాగం ఈనాడు ఉన్న Astronomy కి మూలమైంది. ఇది చాలా ముఖ్యమైంది. దీనివల్లే సౌరసిద్ధాంతం (సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనే వాదం) అతి ప్రాచీనకాలం నుంచి మనదేశంలో ఉంది. చివరిగా కల్పశాస్త్రం అనేది రేఖాగణితానికి సంబంధించినది. యజ్ఞవేదికలు తయారు చేసే సందర్భంలో ఏర్పడిన శాస్త్రమిది. పైథాగరస్ సిద్ధాంతం అంతకుముందే ఎంతో కాలం నుంచి ప్రాచీనులకు తెలుసన్న విషయం ఇటీవలే నిరూపితమైంది. రోమన్ సంస్కృతిలో కేవలం పదివేల వరకే సంఖ్యామానం ఉండగా, వేదగణితంలో లక్షకోట్ల వరకూ సంఖ్యామానం ఉండేది.
అలానే సృష్టి గురించి చెబుతూ చైతన్యం నుంచి ఆకాశం ఏర్పడిందనీ, దాని నుంచి వాయువు, అగ్ని, నీరు, భూమి, వృక్షజాలం, దాన్నుంచి జీవజాలం అనే క్రమంలో ఏర్పడ్డాయని చెప్పడం చాలా ఆశ్చర్యకరమైనది. ఈ విధంగా పైన చెప్పిన ఆరు శాస్త్రాలను వేదాంగాలు అన్నారు. అంటే వీటి సాయం లేకుండా వేదం అర్థాన్ని తెలుసుకోలేం. ఈ విభాగాలన్నింటినీ చదివిన పండితులు నేటికీ ఉండటం మన అదృష్టం.
ఆధునిక విజ్ఞానశాస్త్రమంతా వేదాల్లో ఉన్నదే అనడమే మన సమస్య. దీనికి కారణం ప్రాచీన పండితులకు ఈనాటి పరిశోధనా పద్ధతులు తెలియకపోవడం. కొంతవరకు ఆధునిక విజ్ఞానంపై అవగాహన ఉన్నవారు అన్నీ మనకే తెలుసనే వాదన చేయరు. సంస్కృత రంగంలో దిగ్గజంలాంటి మహామహోపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ‘‘వేదాల్లో ఏమున్నదో చెప్పడం చాలు. అంతేకానీ లేనివాటిని అందులోకి చొప్పించడం అసందర్భమైన పని’’ అని అనేవారు. ప్రముఖ వేదాంత ఆచార్యులు శ్రీ తత్వవిదానంద సరస్వతి లాంటి వారు కూడా ఈ వాదాన్నే సమర్థిస్తారు.
వేదంలో సైన్సును చొప్పించడం మానివేసి అందులో చెప్పిన సర్వాత్మభావం గురించి తెలుసుకుంటే చాలని వీరు అంటారు. సర్వాత్మభావం అంటే చైతన్యం ఒక్కటే ఉన్నదనీ, అదే వివిధ రూపాల్లో కనబడుతుందని ఉపనిషత్తులు చెప్పేవాదం. మన సంస్కృతిలో ఉదారభావాలను, సమానత్వభావాలను తెలుసుకోవడం సమాజానికి ఉపయోగపడగలదు. మన వారసత్వం గర్వకారణంగా ఉండగలదు. అంతేకాని గోవును చంపినవాడి తల నరకాలనే సంకుచిత లేదా మూర్ఖభావాలు వేదాల్లో కనబడవు.
ఆధునిక శాస్త్రజ్ఞులకు పైన చెప్పిన వేదభాగాలపై చాలావరకు అవగాహన లేకపోవడం, ప్రాచీన పండితులకు సైన్స్‌పై అవగాహన లేమి కారణంగా భారతీయ మేధోసంపదకూ, వికాసానికీ ఒకపెద్ద మచ్చ. ఈ రెండు వర్గాల వారినీ అనుసంధానం చేసే వ్యవస్థలు లేకపోవడం, అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసే వనరులు ఉన్న పీఠాలు, మొదలైనవారు ఈ విషయంపై ఆలోచించకపోవడం శోచనీయం. మన మూలసూత్రాలను గూర్చి ఈనాటికీ పాశ్చాత్యులే వారికి తోచిన విధంగా ప్రపంచానికి తెలియజేస్తున్నారు.
ఉదాహరణకు భారతీయ తత్వశాస్త్రంపై ప్రామాణికమైన journal of Indian philosophyఅనే పత్రిక నెదర్లాండ్స్ దేశంలో ప్రచురితమవుతోంది. రచయితలు తొంభై శాతం మంది పాశ్చాత్యులే.
వేదాల్లో ఉన్న ఇబ్బందికరమైన విషయాలను ఏదో విధంగా సమర్థించడం లేదా మభ్యపెట్టడం అనవసరం. దీనివల్ల పండితుల విశ్వసనీయత దెబ్బతింటుంది. లేని వైజ్ఞానిక విషయాలను ఉన్నట్టుగా చెప్పడం హ్యాస్యాస్పదంగా కూడా ఉండవచ్చు. కాలక్రమంలో వచ్చిన మార్పును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం అవసరం.
(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)
-డాక్టర్ కె.అరవిందరావు
రిటైర్డ్ డిజిపి
ఇవి కూడా చదవండి:
ఇవి కూడా చదవండి:
(ఐధాత్ర ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ లో సబ్‌స్క్రైబ్ చేయండి.)