Friday, October 18, 2024
HomeTrending Newsఈసీ అనుమతిస్తేనే డిఎస్సీ : ఏపీ సిఈవో మీనా

ఈసీ అనుమతిస్తేనే డిఎస్సీ : ఏపీ సిఈవో మీనా

డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీల ఉంచి ఫిర్యాదులు వచ్చాయని, దీనిపై విద్యాశాఖ అభిప్రాయం తీసుకొని తరువాత కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా వెల్లడించారు. ఈసీ అనుమతిస్తేనే పరీక్ష జరుగుతుందన్నారు. నిన్న విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా టీజర్ తాను చూడలేదని, ఒకవేళ దానిలో రాజకీయ పరమైన అంశాలుంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని మీనా స్పష్టం చేశారు.

హింస లేకుండా ఎన్నికలు జరపాలన్నదే తమ లక్ష్యమని… హింసారహిత, రీపోలింగ్ అవసరం లేని ఎన్నికలు జరపాలన్న ధ్యేయంతోనే పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల గిద్దలూరు, ఆళ్ళగడ్డలో రాజకీయ హత్యలు చోటుచేసుకున్నాయని… ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను పిలిపించి మాట్లాడతామని, వారి వివరణ తరువాత నివేదికలు తెప్పించుకొని తగిన చర్యలు తీసుకుంటామన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్నటి వరకూ 47 మందిపై చర్యలు తీసుకున్నామన్నారు.  మద్యం అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, జిల్లాల సరిహద్దుల్లో ముమ్మరంగా తనికీలు చేస్తున్నామన్నారు. గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్లు తొలగించామన్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై మూడు రోజుల్లో 385 కేసులు నమోదయ్యాయని, సి విజిల్ ద్వారా 1307 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని.. రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని..  దీనికోసం సువిధ యాప్ తీసుకు వచ్చామని… అనుమతి లేకుండా ప్రచారాలు రోడ్ షో లు చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. వివిధ రకాల అనుమతుల కోసం మూడు రోజుల్లో 388 దరఖాస్తులు వచ్చాయని…వాటిని పరిశీలించి అనుమతులు ఇస్తున్నామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్