తెలుగుదేశం- బిజెపి మధ్య కొంత అండర్ స్టాండింగ్ ఇష్యూ ఉందని, దానిపై తానేమీ మాట్లాడలేనని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అయితే వచ్చే ఎన్నికల్లో ముగ్గురం కలిసే పోటీ చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2014 లో కలిసే పోటీ చేశామని, 2019లో విడిపోయామని, 2020 జనసేన- బిజెపి ఒకే వేదికపైకి వచ్చాయని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కలిసి కూటమిగా పోటీ చేస్తామని చెప్పారు. ఎన్డీయే పక్షాల మీటింగ్ లో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన పవన్ జాతీయ మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి అందరం కలుస్తామని స్పష్టం చేశారు. సిఎం ఎవరన్నది ఎన్నికల తర్వాత నిర్ణయించుకోవచ్చని, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారు సిఎం పదవి చేపట్టవచ్చని చెప్పారు. జనసేన కార్యకర్తలు తనను సిఎంగా చూడాలనుకుంటున్నారని, కానీ క్షేత్ర స్థాయిలో బలాబలాల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని పునరుద్ఘాటించారు.
ఏపీలో అభద్రత నెలకొని ఉందని, శాంతి భద్రతల సమస్యలు ఉన్నాయని.. డేటా బ్రీచ్ జరుగుతోందని.. కాంట్రాక్టర్లకు బిల్లులు సరిగా చెల్లించడం లేదని.. అందుకే వారు పనులు చేయడానికి ముందుకు రావడం లేదని పవన్ విమర్శలు చేశారు. ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని, రాష్ట్రంలో కనీస మౌలిక వసతులు కల్పించడంలో కూడా జగన్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.