Sunday, September 8, 2024
HomeTrending NewsNara Lokesh: నలుగురు రెడ్లే బాగుపడ్డారు: లోకేష్

Nara Lokesh: నలుగురు రెడ్లే బాగుపడ్డారు: లోకేష్

రాబోయే కాలంలో రాయలసీమ  ప్రాంతాన్ని హార్టీ కల్చర్ హబ్ గా తయారు చేస్తామని, ఉపాధి హామీ పథకాన్నిఈ సాగుకు అనుసంధానం చేస్తామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పాదయాత్ర ద్వారా సీమ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు స్వయంగా తెలుసుకున్నానని, బిందు సేద్యాన్ని కూడా ప్రోత్సహిస్తామని, గతంలో ఇచ్చినట్లే  90 శాతం సబ్సిడీతో  రైతన్నకు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతానికే చెందిన జగన్ కూడా గతంలో పాదయాత్ర చేశారని, డ్రిప్ ఇరిగేషన్ పై ఆయనకు అవగాహన ఉండి ఉంటుందని, కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతులకు డ్రిప్ లేకుండా చేయడం బాధాకరమన్నారు. ఉద్యానవన పంటలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసే విషయమై బాబుతో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకొని సీమలో యాత్ర పూర్తయ్యే లోపు విధి విధానాలు ప్రకటిస్తామన్నారు.

కడపలో రెడ్డి సామాజిక వర్గంతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పీఆర్వో చైతన్య రెడ్డి, తన వాస్తు సిద్ధాంతి జయరామి రెడ్డి అని… తనకు కులాల పట్టింపులు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి కలిసి వచ్చే ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తామన్నారు.  ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి సోదరులు హాయిగా ఉన్నారని  పాదయాత్ర మొదట్లో తాను అనుకున్నానని… కానీ అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రెడ్డి సోదరులేనని,  వారు కూడా ఈ ప్రభుత్వ బాధితులేనని పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. జగన్ ప్రభుతంలో  కేవలం నలుగురు రెడ్లు మాత్రమే బాగుపడ్డారని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ రాజకీయంగా  రెడ్డి  సామాజిక వర్గానికి పెద్ద పీట  వేశామని, పలువురిని రాజ్యసభకు కూడా పంపామని, గత ప్రభుత్వ హయాంలో నలుగురికి మంత్రి పదవులు, అందునా కీలక శాఖలు అప్పగించామని అన్నారు. 2019 ఎన్నికల్లో కొన్ని అపోహలు, దుష్ప్రచారాలు చేశారని…  కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి గెలిచారని ఆరోపించారు. సీమలో చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న రెడ్డి సోదరులకు కూడా బిల్లులు ఇవ్వడం లేదని, విజిలెన్స్ విచారణ పేరుతో వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్