రేపటి విశాఖ గర్జనలో లక్షలాది ప్రజలు పాల్గొని తమ ఆకాంక్షను వెల్లడించబోతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమమ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. గతంలో హైదరాబాద్ కోసం తెలంగాణా పోరాటం జరిగిందని, ఇప్పుడు అమరావతి కోసం మరో పోరాటం జరగాలా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ఎంతో వెనకబడి ఉందని, ఈ ప్రాంతానికి రాజధాని కావాల్సిందేనని అమర్నాథ్ స్పష్టం చేశారు. నాన్-పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో జరుగుతోన్నరేపటి విశాఖ గర్జనకు వైసీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జేఎసి నేతలతో కలిసి మంత్రి గుడివాడ నేడు మీడియాతో మాట్లాడారు.
ఆంధ్ర ప్రదేశ్ కు పాలనా రాజధానిగా విశాఖను సాధించుకొని తీరుతామని మంత్రి తేల్చి చెప్పారు. విశాఖ నగరం ఎంతో మందికి అవకాశాలు ఇచ్చిందని, ఆదరించిందని, భవిష్యత్తు ఇచ్చిందని చెప్పారు. అనేక మంది కవులు, కళాకారులు, మేధావులు, పారిశ్రామిక వేత్తలు, క్రీడాకారులను ఉత్తరాంధ్ర ప్రాంతం అందించిందన్నారు. తమ ఆకాంక్షలు తెలియజెప్పేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపు ఇచ్చారు. కోస్తా, రాయలసీమ ప్రాంతం నుంచి కూడా తమ డిమాండ్ కు మద్దతు పలుకుతూ ఎంతోమంది రేపటి గర్జనలో పాల్గొనేందుకు ఇక్కడకు వస్తున్నారని చెప్పారు. తమ పోరాటాన్ని బలంగా ముందుకు తీసుకు వెళతామని చెప్పారు.