Monday, July 1, 2024
HomeTrending Newsవాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే తొలి సంతకం: జగన్

వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధరణపైనే తొలి సంతకం: జగన్

రాబోయే ఎన్నికలు రెండు పార్టీల మధ్య కాదని…. రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు విపక్షాల పెత్తందారీ భావజాలానికి… తమ పార్టీ పేదల అనుకూల భావజాలానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీషు మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్‌ బడిని నాడు-నేడుతో మొదలు.. ఇంగ్లీషు మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్‌ బోధనతో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణంతో బడుల రూపురేఖలు మారుస్తున్న తమకు మధ్య జరుతుతున్న పోరాటం ఈ ఎన్నికలని అన్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగసభలో జగన్‌ ప్రసంగించారు. తనను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని తాము చేస్తోన్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా? అని ప్రజలనుద్దేశించి ప్రశించారు.

“అయ్యా చంద్రబాబు నాయుడు గారూ.. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. వీందరికీ కూడా చెబుతున్నాను. కొంచం ఓపిక పట్టండి. జూన్‌ 4వ తారీఖున మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్ట మొదటి సంతకం మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికీ కూడా మళ్లీ సేవలందించే కార్యక్రమం నా మొట్ట మొదటి సంతకం చేస్తాను” అని ప్రకటించారు.

“నేను ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను. మీ బిడ్డ వేసిన ఈ విత్తనాలు మరో 10–15 సంవత్సరాల్లో ఏ స్థాయి వృక్షాలు అవుతాయంటే.. మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు.. ఏ లెవల్లో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడతారంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్లు మాట్లాడే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంటింటికీ మంచి చేయగలిగాం కాబట్టే, మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు.. వీటితో పని లేదు. ఎందుకంటే మనం ఇంటింటికీ మంచి చేయగలిగాం” అని వివరించారు.

“ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి, 175కు 175 ఎమ్మెల్యేలు.. నేను మరొక్కసారి చెబుతున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం. ఆ అధికారంతో పాలకులు మన తలరాతలు మారుస్తారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు పూర్తిగా డబుల్‌ సెంచరీ కొట్టడానికి సిద్ధమేనా అని అడుగుతున్నాను. దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దయతలచాలని, మీ చల్లని దీవెనలతో మళ్లీ రెండు నెలల తిరగక మునుపే మీ బిడ్డ మళ్లీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు, అవకాశం దేవుడు ఇవ్వాలని” ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్