తెలుగుదేశం అంటే తమాషా కాదని, బూతులు తిట్టేవారికి తామూ సమాధానం చెప్పగలమని… తాను తిట్టక్కర్లేదని, కార్యకర్తలకు ఒక్క మాట చెబితే వారి తిట్లకు వైసీపీ బూతుల నేతలు పారిపోవాల్సి వస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా గుడివాడలో జరిగిన బహిరంగ సభలో కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. అతనికి రాజకీయంగా తామే భిక్ష పెట్టామని, ఇలాంటి వ్యక్తులకు గుణపాఠం చెప్పి చరిత్ర హీనులను చేసేవరకూ టిడిపి నిద్రపోదని శపథం చేశారు. బూతుల ఎమ్మెల్యే రోడ్లు వేయలేకపోయారని కానీ క్యాసినో, క్యాబరే డ్యాన్స్ లు, పేకాట క్లబ్బులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఎన్టీఆర్ మొదటిసారి పోటీచేసిన గుడివాడ నియోజకవర్గంలో ఇంత పెద్దఎత్తున సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి తులసి వనంలో గంజాయి మొక్క లాంటి వారు ఇప్పుడు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. భోగరాజు పట్టాబి సీతారామయ్య, గొట్టిపాటి బ్రహ్మయ్య, చండ్ర రాజేశ్వరరావు, అక్కినేని నాగేశ్వర రావు, విశ్వనాథ సత్యనారాయణ, కెఎల్ రావు, వేదాంతం రాఘవయ్య, ఘంటసాల వెంకటేశ్వర రావు, వేటూరి సుందర రామమూర్తి లాంటి ఎందరో మహనీయులు పుట్టిన గడ్డ గుడివాడ అన్నారు.
తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందంటూ సిఎం జగన్ విర్రవీగారని, పట్టభద్రుల ఎన్నికల ఫలితాలతో నేలమీదకు దిగారని, ఆఖరుకు పులివెందులలో కూడా టిడిపి జెండా ఎగిరిందని, అప్పటినుంచి నేలమీదకు చూస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఫలితంతో జగన్ దిమ్మదిరిగిందని, ఒక్క దెబ్బతో దయ్యం దిగిందని వ్యాఖ్యానించారు.
తెలుగుజాతికి ఐటి అనే ఆయుధాన్ని తానుఇచ్చానని, దానితో ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లిన మన యువత అక్కడివారికంటే ఎక్కువ సంపాదించారని బాబు అన్నారు. అమెరికాలో టాప్ 20 భాషల్లో తెలుగు కూడా ఉండడం ఎంతో తృప్తి ఇచ్చే అంశమన్నారు. తన శేష జీవితాన్ని నిరుపేదల కళ్ళలో ఆనందం కోసమే అకింతం చేస్తానని ప్రకటించారు.
బాడుడే బాదుడు ఇప్పుడు వీర బాడుగా మారిందన్నారు. కిరణా కొట్లో పనిచేసే గూగుల్ పే, ఫోన్ పే లిక్కర్ షాపుల్లో ఎందుకు పనిచేయదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో సిఎం జగన్ ను ఓడించి రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని వదిలించుకోవాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.