BJP Protest on Jagan Government: జగన్ పాలనలో వందల హిందూ ఆలయాలను కూల్చివేసినా ఇంతవరకూ ఒక్కరిపై కూడా కేసు పెట్టలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇది జగన్ అద్భుతమైన పాలనకు నిదర్శమనమని ఎద్దేవా చేశారు. అంతర్వేది ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనసులు దగ్ధం అయ్యాయన్నారు. చర్చి మీద ఎవడో రాళ్లు వేస్తే.. వెంటనే కేసులు పెట్టారని, అలాంటప్పుడు జగన్ ను క్రిస్టియన్ వాది అనాలా, అసమర్ధుడు అనాలా అని నిలదీశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో అటల్ బిహారీ వాజపేయి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వీర్రాజు మాట్లాడుతూ హిందువులు దేవుళ్ల నగలను బాండ్స్ గా మారుస్తున్నారని, వాటిని కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ సొమ్ముతో చర్చిల నిర్మాణాలు వెంటనే ఆపాలని డిమాండ్ చేసిన సోము, ఫాదర్లకు డబ్బులు ఇవ్వడంపై కోర్ట్ లో పోరాడతామని తెలిపారు.
ఏపి లో బ్లాక్ మెయిల్ రాజకీయ పార్టీలు పెరిగాయని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కు వ్యతిరేకమని తాము కూడా చెప్పామని గుర్తు చేశారు. ‘మీరు మాత్రం పాల డైరీలను అమ్మేసుకోవచ్చా… మా పై నిందలు వేస్తారా’ అని సోము ప్రశ్నించారు. ఈనెల 28వ తేదీన ప్రభుత్వం పై పోరుబాటకు బిజెపి సిద్దం అవుతోందని, ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేసే ఏకైక పార్టీ బిజెపినేనని, అమరావతిపై తమ విధానాన్ని ఎప్పుడో చెప్పామని, దానికే కట్టుబడి ఉంటామని సోము స్పష్టం చేశారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తావులేదని, అలాంటి వారిని తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. విజయవాడలో ఈనెల 28న ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై భారీ బహిరంగ సభను ‘ప్రజా ఆగ్రహ సభ’ పేరిట నిర్వహిస్తున్నామన్నారు. ఈనెల 28న మధ్యాహ్నం ఒంటి గంటనుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేపడతామన్నారు.
అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకునే ఏకైక పార్టీ బిజెపియేనని రాష్ట్ర బిజెపి వ్యవహారాల కో ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ అన్నారు. తమ పార్టీపై మతతత్వం ముద్ర వేసిన వారికి పని విధానం ద్వారానే జవాబు చెబుతామన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలే లక్ష్యంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, వైసీపే నేతలు మాయ మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. మత మార్పిడులను పాలకులే ప్రోత్సహిస్తున్నారని, హిందూ దేవాలయాల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్నారని, మత రాజకీయాలు మానుకోవాలని అయన సలహా ఇచ్చారు.