తెలుగుదేశం పార్టీ ఎవరిమీదా ముందుగా కర్ర ఎత్తబోదని, ఎవరైనా తమ మీద దాడి చేస్తే వారి తాటతీసేంత వరకూ వదలబోమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు హెచ్చరించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి ఎన్ని కేసులకైనా, జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఇప్పుడు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ టిడిపి కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న పోలీసు అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, రాబోయే కాలంలో వారిని న్యాయస్థానాల్లో నిలబెడతామని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రామానాయుడు… నిన్న కుప్పంలో జరిగిన ఘటనలపై స్పందించారు.
చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందని రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లిలో బాబు ఇంటిపై, కుప్పంలో ఆయన పర్యటనలపై దాడులు ఈ అనుమానాన్ని బలపరుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో డిజిపి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) లో పని చేస్తున్నారా, లేక ఇండియన్ జగన్ సర్వీస్ (ఐజెఎస్) లో పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి పర్యటన, బాబు ఇంటిపై జోగి రమేష్ దాడి ఘటనల్లో పోలీసు అధికారుల వ్యాఖ్యలు అమానుషమన్నారు. తమ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి విషయాన్ని కూడా పోలీసు యంత్రాంగం తేలిగ్గా తీసుకుందన్నారు. ఓ మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు కుప్పం పర్యటనకు ఎప్పుడో షెడ్యూల్ ఇస్తే ఆయనకు వ్యతిరేకంగా అధికార వైసీపీ ఆందోళనలకు పోలీసులు ఎలా అనుమతి ఇస్తారని రామానాయుడు నిలదీశారు. కుప్పంలో తమ పార్టీ కార్యకర్తలపై విచక్షణారహితంగా, రక్తం వచ్చేలా దాడి చేసినా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని రామానాయుడు మండిపడ్డారు.
Also Read : అభూత కల్పనలతో సిఎం ప్రసంగం: రామానాయుడు