Friday, October 18, 2024
HomeTrending Newsబిజెపి నిర్ణయంపైనే అందరి చూపు!

బిజెపి నిర్ణయంపైనే అందరి చూపు!

What Next?: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేస్తామని ఎన్డీయే భాగస్వామిగా ఉన్న  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ  ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. పైగా ఈ పొత్తులో బిజెపి కూడా కలిసి వచ్చేలా ఒప్పిస్తామని పవన్ చెబుతున్నారు.

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది, 2009, 14 ఎన్నికల్లో అసలు ఖాతానే ప్రారంభించలేదు. రాబోయే ఎన్నికల్లో కూడా ఆ పార్టీ ఉనికి చాటుకుంటుందన్న నమ్మకం లేదు.

ఇక బిజెపి, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తులో, జనసేనాని సహకారంతో బరిలోకి దిగి నాలుగు ఎమ్మెల్యే, రెండు ఎంపి సీట్లు గెల్చుకుంది. ఆ సమయంలో ఏపీ అభివృద్ధికి ఊతమిస్తామని హామీ ఇచ్చిన బిజెపి.. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలను నిర్లక్ష్యం చేయడంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత  మూటగట్టుకుంది. అందుకే గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఆ పార్టీకి  రాష్ట్రంలో ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన  బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో జన సేన ప్రత్యక్ష సహకారం, టిడిపి పోటీలో లేకపోయినా 14 శాతం మాత్రమే వచ్చాయి.

ప్రస్తుత పరిణామాల్లో మళ్ళీ బాబుతో కలిసి ‘2014 ఫార్ములా’  పోరుకు బిజెపి సిద్ధపడుతుందా? నాలుగేళ్ళుగా అనేక అంశాల్లో కేంద్రానికి సహకరించిన వైఎస్ జగన్ కు పరోక్షంగా మేలు చేకూర్చేలా వ్యవహరిస్తుందా అనేది అతి త్వరలో తేలనుంది.

వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని… ఎంపి సీట్లలో అధిక భాగం కేటాయిస్తామని బిజెపికి బాబు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది.  గతంలో బాబు ప్రవర్తనపై ఇంకా కోపంగానే ఉన్న బిజెపి పెద్దలు దీనిపై ఎటూ తెల్చుకోలేకపోతున్నారట. నమ్మకం లేని బాబు ప్రత్యక్ష మిత్రత్వం కంటే నమ్మకస్తుడైన జగన్ పరోక్ష మిత్రత్వమే మేలనే భావన వారిలో ఉండొచ్చు. కానీ బిజెపిలో ఉన్న బాబు అభిమానులు శతవిధాలా పొత్తుకోసం అధిష్టానాన్ని ఒప్పించే పనిలో ఉన్నారు. తాజాగా పవన్ కూడా ఈ టాస్క్ లో భాగమయ్యారు

బిజెపి ముందు మూడు దారులు…

ఒకటి ఒంటరిగా పోటీ చేయడం: ఇదే జరిగితే గత ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతానికే పరిమితమవుతుంది. వైసీపీ- టిడిపి, జనసేన… ఇద్దరు బలమైన ప్రత్యర్థుల పోరులో ఉనికి సాధించడం చాలా కష్టం.

రెండోది వైసీపీతో కలిసి వెళ్ళడం: ఇది సాధ్యపడదు. క్రిస్టియన్, మైనార్టీ ఓట్లపై ఆధారపడిన జగన్… బిజెపితో పొత్తుకు సిద్ధపడరు.

మూడోది టిడిపి, జనసేన కూటమితో కలిసి వెళ్ళడం: పొత్తులో వెళ్ళినా బిజెపి పోటీ చేయబోయే స్థానాల్లో ఓట్ల ట్రాన్స్ ఫర్ సాధ్యం కాదు. ఎందుకంటే 2014లో ఏపీకి మోడీ ఏదో చేస్తారనే ఆశతో బిజెపిని నమ్మారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. అందులోనూ అప్పుడు జనసేన ప్రత్యక్షంగా బరిలో లేదు… ఇప్పుడు మూడు పార్టీల కార్యకర్తల మధ్య ఏకాభిప్రాయం ఏ మేరకు కుదురుతుందనేది ప్రశ్నార్ధకమే.

1999 లో చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న బిజెపి తెలుగునాట 25 ఏళ్ళ పాటు వెనకబడింది. ప్రస్తుతం  కేంద్రంలో బలమైన నాయకత్వం,  సాహసోపేత నిర్ణయాలు తీసుకోదగిన స్థాయిలో ఉండి కూడా బిజెపి పెద్దలు ఏపీలో పార్టీ బలోపేటానికి  చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనేది ఆశ్చర్యకరం.

కొద్దో గొప్పో బలంగా ఉన్న తెలంగాణలో… గట్టిగా కృషి చేస్తే అధికార పీఠాన్ని అందుకుంటుందన్న స్థాయి నుంచి ఇటీవల తీసుకున్న కొన్ని నిర్ణయాలతో మళ్ళీ అదే నాలుగైదు సీట్ల స్థాయికి బిజెపి పడిపోయింది.

అసలు ఏపీలో బిజెపికి కావాల్సింది పొత్తులు కాదు, తమిళనాడులో అన్నామలై తరహాలో… ఇక్కడి ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేయగలిగిన ఓ బలమైన నేత. ప్రస్తుతం  దగ్గుబాటి పురందేశ్వరిని నియమించినా ఎన్టీఆర్ లెగసీ అనేది టిడిపితోనో, బాబుతోనో ఉంటుంది తప్ప పురందేశ్వరితో రాదు. మౌలిక అంశాలపై  దృష్టి సారించకుండా జనసేన తోనో, తెలుగుదేశం తోనే పొత్తు రాజకీయాలే చేస్తూ పొతే రాష్ట్రంలో ఇక ఆ పార్టీ సొంతంగా ఎదిగే పరిస్థితి ఏమాత్రం ఉండదు.

ఏది ఏమైనా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పూర్తయి, జమిలి ఎన్నికలపై ఓ స్పస్థత వచ్చిన తరువాతే ఏపీ విషయంలో బిజెపి తన వైఖరి తేల్చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్