Saturday, November 23, 2024
HomeTrending NewsDK Aruna: వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై కెసిఆర్ డ్రామాలు - డీకే అరుణ

DK Aruna: వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీపై కెసిఆర్ డ్రామాలు – డీకే అరుణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో తన వైఫల్యం బయటపడటంతో కేటీఆర్ కు మైండ్ దొబ్బిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఘాటుగా విమర్శించారు.  ఏం మాట్లాడుతున్నరో ఆయనకే అర్ధం కావడం లేదన్నారు. రాష్ట్రంలో వాళ్లు తెరిపిస్తామన్న నిజాం షుగర్స్, రేయాన్స్, అజంజాహి, సిర్పూర్ కాగజ్ మిల్లులను తెరిపించడం చేతగాదు కానీ… వైజాగ్ స్టీల్ లో వాటా పెడతామని బోగస్ మాటలు చెబుతావా? అంటూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నిస్తే… తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కిందిది మీద, మీదది కింద అన్నట్లుగా బయ్యారం స్టీల్ అంశాన్ని కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేసిండన్నారు. మాజీ మంత్రి శ్రీమతి డీకే అరుణ ఈరోజు హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో మండిపడ్డారు.

ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఐరన్ ఓర్ లకు ఏపీలో ఉండే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి, తెలంగాణకు ఏం సంబంధం ? అదేదో ఈ రెండు లేకపోతే తెలంగాణలో తినడానికి అన్నమే దొరకదనట్లుగా కేటీఆర్ మాట్లాడుతున్నడన్నారు. ఒడిశా రాష్ట్రంలోని మైనింగ్ లో ఎవరు బిడ్డింగ్ వేశారో.. మరి నిజంగా అక్కడ అవినీతి జరిగితే నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఎందుకు నోరు మూసుకుంది? అక్కడేమైనా బీజేపీ ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు.  నవీన్ పట్నాయక్ కు తెల్వని బైలడిల్ల మైనింగ్ కుంభకోణం కేటీఆర్ కు ఎట్లా తెలిసిందో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.

కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యంతో రాష్ట్రంలో టీఎస్సీఎస్సీ పేపర్ లీకై 30 లక్షల మంది నిరుద్యోగులు మనోవేదనతో ఉన్నారని డీకే అరుణ విమర్శించారు. యువత మొత్తం కేసీఆర్ ప్రభుత్వంపై కసితో ఉంది. కేవలం లీకు అంశాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ బైలడిల్ల పేరుతో కొత్త డ్రామాకు తెరదీశారన్నారు. తండ్రీకొడుకులకు గజకర్ణ గోకర్ణ విద్యలు బాగా తెలుసని, ప్రజలను మాయ చేసేందుకు డ్రామాలాడటం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. .

RELATED ARTICLES

Most Popular

న్యూస్