వచ్చే నెల ఈరోజుకి ఎన్నికలు పూర్తవుతాయని, వైసీపీ ఓటమి కూడా బాక్సుల్లో చేరిపోయి ఉంటుందని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మనం ఓ కీలక దశకు చేరుకున్నామని, ఐదేళ్ళ వైసీపీ దుష్ట పరిపాలనకు చరమాంకం పలకబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెనాలిలో జరిగిన వారాహి విజయ యాత్రలో పవన్ పాల్గొని ప్రసంగించారు.
సిఎం జగన్ పై రాయి దాడి ఘటనపై పవన్ స్పందించారు. “ జగన్ పై ఎవరో రాళ్ళు విసిరారట… అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్ రాగానే ఏదో గాయం జరుగుతుంటుంది… ఎలక్షన్ ముందే ఎవరో చనిపోవడమో, లేక చంపేయడమో” అంటూ ఎద్దేవా చేశారు. అధికారం, డబ్బు ఉన్నవాడు ఏం చేసినా దానికో నైతిక భాష్యం ఇస్తామన్నారు. సిఐఎస్ఎఫ్ తో హై సెక్యూరిటీ భద్రతా మధ్య ఉండే వ్యక్తిపై దాడి జరుగుతుంటే జడ్ కేటగిరీ ఏం చేస్తుందని…జగన్ కు గాయమైతే రాష్ట్రానికి గాయమైనట్లా…. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్ళ వర్షమే కురిపించారుగా అంటూ ఎదురు ప్రశ్నించారు.
14 ఏళ్ళ సుగాలి ప్రీతిపై మానభంగం చేసి హత్య చేస్తే దానిపై ఎవరూ పట్టించుకోరని…. సిఎం జగన్ పై చిన్న గులకరాయి పడి బొక్క పడితే రాష్ట్రమంతా ఊగిపోతుందంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. తప్పు జగన్ మోహన్ రెడ్డిది కాదని, మనదేనని, మనకు పౌరుషం చచ్చిపోయిందంటూ ప్రజలనుద్దేశించి అన్నారు. దాస్యం చేసే కంటే చచ్చిపోవడమే మేలని అభివర్ణించారు,
“మా అన్నయ్య చిరంజీవి గారు మొన్న నన్ను పిలిచి, నువ్వు ప్రజల కోసం, కౌలు రైతులకు సాయం చేస్తున్నావు, నీ పోరాటం ఆగకూడదు అని 5 కోట్లు ఇచ్చి ఆశీర్వదించారు. అంతేకాకుండా కొడుకు రామ్ చరణ్ ను కూడా సాయం చేయమని చెప్పారు, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అని కృతజ్ఞతలు తెలియజేశారు.