Monday, January 20, 2025
HomeTrending Newsపోషణ్ అభియాన్ కు కేంద్రం హామీ

పోషణ్ అభియాన్ కు కేంద్రం హామీ

బాలలు, బాలింతలు, గర్భిణీల సంక్షేమం కోసం తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ చేస్తున్న కార్యక్రమాలు అద్భుతుంగా ఉన్నాయని, తెలంగాణ మోడల్ ను దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటూ కేంద్రం తెలంగాణపై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సమగ్ర అభివృద్ధి కోసం  చేపడుతున్న బాలామృతం, గ్రోత్ మానిటరింగ్ స్పెషల్ డ్రైవ్(పిల్లల పెరుగుదల నమోదు ప్రత్యేక కార్యక్రమం) బాగున్నాయని, కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ కొనియాడారు. తెలంగాణలో అందిస్తున్న బాలామృతానికి అనేక రాష్ట్రాల నుంచి డిమాండ్ ఉందని, దీని ఉత్పత్తని మరింత పెంచి ఇతర రాష్ట్రాలకు ఇవ్వడం కోసం కావాల్సిన సాయాన్ని కేంద్రం అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా గ్రోత్ మానిటరింగ్ కార్యక్రమాన్ని తెలంగాణలో అద్భుతంగా నిర్వహిస్తున్నారని, దీనిని దేశవ్యాప్తంగా అమలు చేయడం ద్వారా పిల్లల ఎదుగుదల, ఆరోగ్య పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం చేపట్టిన వివిధ పథకాల గడువు ముగుస్తుండడం, వాటికి కేంద్ర వాటా తగ్గించడం, కొనసాగించకపోవడంపై నేడు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎంపీ శ్రీమతి కవిత, గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్ కేంద్ర మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీని ఢిల్లీలో కలిసి వినతి పత్రం ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఆహ్వానించగా, ఆమె వెంటనే అంగీకరించారు. త్వరలోనే తెలంగాణకు వచ్చి మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలు పరిశీలించి, దేశవ్యాప్తంగా వీటిని అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు. పోషణ్ అభియాన్ పథకానికి 2021 సెప్టెంబర్ తో గడువు ముగుస్తుడడంతో…దీనిని మరింత సమర్థవంతంగా కొనసాగిస్తామని, ఆపే ప్రసక్తి లేదని హామీ ఇచ్చారు. అదేవిధంగా కేంద్రం వాటా పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తామిచ్చిన విజ్ణప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, వీటన్నింటిని పరిష్కరిస్తే మహిళలు, శిశువులకు మరింత ప్రయోజనం కలుగుతుందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్