Sunday, November 3, 2024
HomeTrending NewsTDP-1 : తెలుగుదేశం పార్టీకి జనసేనే దిక్కా?

TDP-1 : తెలుగుదేశం పార్టీకి జనసేనే దిక్కా?

తెలుగుదేశం పార్టీ పయనం ఎటు వైపు సాగుతోంది. తెలంగాణలో అధఃపాతాళానికి చేరుకున్న టిడిపి… స్వరాష్ట్రంలో కూడా పట్టు కోల్పోతోందా అనే చర్చ జరుగుతోంది. నాయకత్వ వైఖరితో క్షేత్రస్థాయిలో గందరగోళం కనిపిస్తోంది. బాబు అరెస్టుతో నేతల్లో స్తబ్దత ఆవరించింది.

బాబు జైలుకు వెళ్ళగానే టిడిపి నేతల కన్నా అధికంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిరసన గళం వినిపించారు. రోడ్డుపై పడుకోవటం దగ్గర నుంచి జైలుకు వెళ్లి పరామర్శించటం వరకు తెలుగు తమ్ముళ్ళను మించి చంద్రబాబుకు అండగా నిలిచారని ఆ పార్టీ నేతలే అంటున్నారు.

బాబును జైల్లో కలిసిన వెంటనే.. టిడిపితోనే జనసేన ఎన్నికలకు వెళుతుందని చెప్పారు. అప్పటి వరకు బిజెపితో ఉన్న పవన్ వారిని సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారా? ఈ ప్రకటనతో అందరు విస్తుపోయారు. రాష్ట్రంలో జనసేన మినహా వామపక్షాలు, బిజెపి ప్రకటనలకే పరిమితం అయ్యాయి. ఈ నెల రోజుల నుంచి టిడిపికి పవన్ తోడే దిక్కు అన్నట్టుగా మారింది.

నిన్నమొన్నటి వరకు పవన్ కు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దగ్గర నుంచి ఈ రోజు జనసేనానిని సంప్రదించకుండా టిడిపి నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. బాబుకు బెయిల్ తొందరగా రాకపోతే జనసేన బలపడుతుందని, గెలుపే పరమావధిగా నడుచుకునే  కొందరు తమ్ముళ్ళు మూడో కంటికి తెలియకుండా పవన్ తో టచ్ లో ఉన్నారు.

అటు తెలంగాణలో జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని బిజెపి చర్చలు జరుపుతోంది. రాబోయే ఎన్నికల్లో సైకిల్ తో సవారీ చేసేందుకు బిజెపి సిద్దమైనా…మైనారిటీల ఓట్లు పడవనే భయంతో దూరం పెడుతోందని సమాచారం. బాబును దారిలోకి తీసుకొచ్చేందుకే పురుందేశ్వరికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారని అమరావతిలో చర్చలు జరుగుతున్నాయి.  బాబు అరెస్టు తర్వాత బిజెపి నేతలు స్పందించటం…అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వటం సైకిల్ తో స్నేహం చేసేందుకే అని ఢిల్లీ వర్గాల వాదనగా ఉంది.

జనసేన ద్వారా కమలం నేతలే టిడిపికి సంకట స్థితి కలిపిస్తున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. చంద్రబాబుకు అన్నీ తానే అన్నట్టుగా పవన్ వ్యవహరిస్తున్నారు. జనసేన తెలంగాణలో బిజెపితో జట్టు… ఏపిలో టిడిపితో పొత్తు అనుమానాలకు తావిస్తోంది. ఏపి ఎన్నికల నాటికి తప్పనిసరిగా బిజెపితో టిడిపి కలిసి వెళ్ళే విధంగా తెర వెనుక పావులు కదులుతున్నట్టుగా ఉంది.

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి పోటీ చేయదని ప్రకటించటం… మరుసటి రోజే టిడిపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయటం జరిగింది. బాలరిష్టాల్లో ఉన్న జనసేన పోటీలో ఉంటే… క్షేత్ర స్థాయిలో అంతో ఇంతో పట్టు ఉన్న టిడిపి పోటీ నుంచి తప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేన ఉనికి పట్టించుకోని నేతలు ఇప్పుడు తెరచాటు చర్చలు మొదలు పెట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు చెందిన అసంతృప్త నేతలు… బిజెపితో పొత్తులో వచ్చే సీట్లలో అవకాశం ఇవ్వాలని లాబీయింగ్ చేస్తున్నారు.

ఇదంతా చూస్తుంటే మహారాష్ట్రలో శివసేన మాదిరిగా ఏపిలో టిడిపి తయారుకానుందా అని తెలుగు తమ్ముళ్ళు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్రలో శివసేన నేతల్లో చీలిక వచ్చి దెబ్బతింటే… ఏపిలో జనసేనతో సైకిల్ పంక్చర్ అవుతుందా అనే విశ్లేషణలు జరుగుతున్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్