బీఆర్ఎస్ లో ఉన్నపుడు ఇద్దరు నేతల మధ్య సఖ్యత నామమాత్రంగానే ఉండేది. ఖమ్మం జిల్లాలో ఇద్దరు నేతల కులాల మధ్య ఉప్పు నిప్పు రాజకీయాలు సాగుతుంటాయి. తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే సిఎం కెసిఆర్ పై ఉన్న కోపంతో ఇద్దరు నేతలు ఒక్కటవుతున్నట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇంటికి ఈ రోజు కాంగ్రెస్ ప్రచార కమిటీ కోర్ ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రావడంపై ఉత్కంఠ సంతరించుకుంది.
కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన వెళ్లినట్లు… తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి ఆహ్వానించారు. “ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి ఖమ్మంలో గుర్తింపు తెచ్చిందే తుమ్మల” అని పొంగులేటి అన్నారు. “బీఆర్ఎస్‌లో చేరాక, కేబినెట్ మంత్రి అయ్యాక.. బీఆర్ఎస్ పార్టీని విస్తరించడమే కాక, తన లాంటి నేతల్ని కూడా ఆ పార్టీలోకి తీసుకెళ్లారు” అని పొంగులేటి తెలిపారు. బీఆర్ఎస్ కావాలని పొమ్మనకుండా పొగపెట్టి.. తనను, తుమ్మల లాంటి వారిని వెళ్లిపోయేలా చేస్తున్న తీరును తెలంగాణ ప్రజలు చూస్తున్నారని పొంగులేటి అన్నారు.
తుమ్మల నాగేశ్వర రావు రాజకీయ ప్రయాణం ఎటువైపు సాగుతుందని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది. ఆయన నిర్ణయం గురించి అభిమానులు, కార్యకర్తలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఆయన కారు దిగి…హస్తం గూటికి చేరతారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
తుమ్మలకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో… కాంగ్రెస్ తనను ఆహ్వానించిందని ఇప్పటికే చెప్పిన ఆయన…కాంగ్రెస్‌లో చేరతారా లేదా అనే అంశంపై రాజకీయ వేడి రాజుకుంది. అనుచరులు, అభిమానులతో చర్చించాక నిర్ణయాన్ని వెల్లడిస్తానని తుమ్మల పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారా అని..అనుచరులు ఆయన ఇంటి వద్దకు భారీగా తరలివచ్చారు. పొంగులేటి రాకతో తుమ్మల కచ్చితంగా కాంగ్రెస్‌లో చేరతారనే అందరూ అనుకుంటున్నారు.