Saturday, November 23, 2024
HomeTrending Newsవరి వేదన

వరి వేదన

Who Is Really Fighting For The Farmer 

భూమి కోసం పోరాటం..
పెట్టుబడి కోసం పోరాటం..
విత్తనం కోసం పోరాటం..
నీటి కోసం పోరాటం..
ఎరువు కోసం పోరాటం..
చీడ-పీడలతో పోరాటం..
ప్రకృతితో పోరాటం..
చచ్చి-చెడి పండించిన పంట అమ్ముకోవడానికి పోరాటం..
గిట్టుబాటు ధర కోసం పోరాటం..
లాభం సంగతి దేవుడెరుగు.. కనీసం ఈ పంట కోసం చేసిన అప్పులు తీరితే చాలనే ఆరాటం.
దేశంలో రైతుల పరిస్థితి చాలా “విచిత్రం” గా ఉంది అనుకొంటే..
తెలంగాణ రైతుల పరిస్థితి “అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి లా” ఉంది.

శ్రమించి, పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్ లో కుప్ప వేసుకొని,
కొనడానికి ఎవరొస్తారా అని ఆరాటం..
ముక్కితే కొనరేమో అని ఆరాటం..
తడిస్తే తూకంలో తరుగు కిందే మొత్తం దోచేస్తారేమో అని ఆరాటం..
ఎండితే రేట్ పలకదేమో అని ఆరాటం..
కుప్ప పోసిన ధాన్యాన్ని ఎండకు ఎండకుండా తన చేతులతో కప్పాలని ఆరాటం..
వానకు తడవకుండా తన ఆడదాని చీర కొంగు తో కప్పాలని ఆరాటం.
ఎండకుండా, తడవకుండా పైన కప్పులా ఏ గోవర్ధనగిరినో ఎత్తి పట్టుకోవాలని ఆరాటం.
ఎప్పుడూ వేసే వరే, ఇప్పుడు ఎందుకు కొనం అంటున్నారో తెలుసుకోవాలనే ఆరాటం.

మళ్ళీ పేరుకు కేంద్రంలో, రాష్ట్రంలో రెండూ రైతు సంక్షేమ ప్రభుత్వాలే.
గుండెల్లో పెట్టి చూసుకొనేవాడొకడు..
కడుపులో పెట్టి దాచుకొనేవాడొకడు..

కేంద్ర ప్రభుత్వం – రాష్ట్ర ప్రభుత్వం..
అధికారం పక్షం- పెద్ద ప్రతిపక్షం- చిన్న ప్రతిపక్షం..
అందరూ రైతుల మేలు కోసమే పోరాడుతున్నారు.
నీదే తప్పు ఆంటే నీదే తప్పని వాదులాడుకొంటున్నారు.
ధర్నాలు చేస్తున్నారు. డప్పులు వాయిస్తున్నారు.
బంద్ లు చేస్తున్నారు. అన్యాయం జరిగితే ఊరుకోమని జబ్బలు చరుస్తున్నారు.
మెడలు వంచుతామంటున్నారు.. మక్కెలు విరగదీస్తా మంటున్నారు.
న్యాయం జరిగే వరకు వదలమని సవాళ్లు విసురుతున్నారు.
కాని రైతుకు న్యాయం చేసేదెవరు?

ఎవరు నిజంగా రైతు కోసం పోరాడుతున్నారు?
ఎవరు రాజకీయ లబ్ది కోసం పోరాడుతున్నారు?
రైతుకు ఇది నిజంగా సంకట స్థితి.

గోడౌన్ ల నిండా ధాన్యం రాశులుగా పడి ఉంటే.. ఆ తప్పు రైతుదా?
పోగుపడిన ధాన్యాన్ని సక్రమంగా వినియోగించుకోలేని ప్రభుత్వానికి ఏ బాధ్యత లేదా?
ప్రభుత్వ గోడౌన్ లలో కుప్పలు కుప్పలుగా “బియ్యం” పడి ఉన్నా, సగటు మధ్య తరగతి మానవుడికి కనీసం
నలభై రూపాయలు పెట్టందే కిలో బియ్యం ఎందుకు దొరకడం లేదు?
ఆరుగాలం కష్టపడే రైతుకు కనీసం పంటకు గిట్టుబాటు ధర ఎందుకు రావడం లేదు?
పెట్టుబడికి కాసిన్ని పైసలు ఇచ్చి, దానికి మిత్తి పై మిత్తి కట్టి, కళ్ళాల నుంచే ధాన్యాన్ని తరలించుకు పోయే వ్యాపారస్తులకు ఎలా వస్తున్నాయి లాభాలు?
పంట కోతల సమయానికి కాసిన్ని డబ్బులు చేతబట్టుకొని పొలాలపై పడి ధాన్యం కొని.. నాలుగు రోజులు దాచి మార్కెట్ లో అమ్ముకొనే దళారులకు ఎలా వస్తున్నాయి లాభాలు?

అందుకేనా మహాకవి శ్రీ శ్రీ..
పగలు రేయి శ్రమ పడుతున్నా
ఫలితం దక్కని దీనులకు
ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని
ఎదురు చూసి మోసపోకుమా
నిజం మరచి నిదురపోకుమా.. అని హెచ్చరించింది.

రైతు పండించిన పంటను కొని రైతుకు న్యాయం చేయలేని ప్రభుత్వాలు అవసరమా?

“అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా నెక్కిన బారని గుఱ్ఱము” లాగా
ఈ నాయకులను గూడా “గ్రక్కున విడవ” వలసిన సమయం వచ్చిందా!

-శ్రీ వెంకట సూర్య ఫణి తేజ

Also read : ప్రాజెక్టులు రైతుల కోసమా.. కాంట్రాక్టర్ల కోసమా?

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్