Sunday, September 29, 2024
HomeTrending NewsBJLP: కమలం శాసనసభ పక్ష నేత ఎవరు?

BJLP: కమలం శాసనసభ పక్ష నేత ఎవరు?

తెలంగాణ బిజెపి శాసనసభ పక్ష నాయకుడిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది పార్టీలో చర్చనీయంశంగా మారింది. మూడుసార్లు గెలిచిన రాజసింగ్ కు ఇస్తారా…రెండోసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డికి ఇస్తారా…వీరిద్దరిని కాదని మొదటిసారి గెలిచిన వారిలో ఒకరికి ఛాన్స్ ఇస్తారా రెండు రోజుల్లో తేలనుంది.

తెలంగాణలో బిజెపికి సంకట స్థితి ఏర్పడింది. బిజెపి నుంచి పోటీ చేసిన మహామహులు ఓడిపోగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. గెలిచిన వారిలో ఆరుగురు మొదటిసారి చట్టసభల్లో అడుగుపెడుతున్నారు. గోషామహల్ నుంచి రాజాసింగ్ మూడోసారి గెలిచారు. హిందుత్వంపై వేగంగా స్పందించే రాజాసింగ్ మిగతా అంశాల్లో శాసనసభలో ఎంతవరకు రానించగలరనే అంశంపై పార్టీ నాయకత్వంలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దూకుడుగా వ్యవహరించే ఈయన వైఖరి అన్ని సందర్భాల్లో పార్టీకి మేలు చేయదని…పార్టీ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చట్టసభలు వేదికగా వినియోగించుకోవాలని…పార్టీ యోచనగా ఉంది.

రాజాసింగ్ కాదనుకుంటే రెండోసారి గెలిచిన మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. ఈయన మొదటిసారి ప్రజారాజ్యం తరపున నిర్మల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పొసగక కాంగ్రెస్ వీడి బిజెపిలో చేరారు. బిజెపి టికెట్ మీద రెండోసారి నిర్మల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియారిటీ పరంగా ఒకే అనుకున్నా.. పార్టీ క్రమశిక్షణకు అనుగుణంగా ఎంతవరకు నడుచుకుంటారని చర్చ జరుగుతోంది.

వీరిద్దరిని కాదని మొదరిసారి గెలిచిన వారిలో ఎన్నుకుంటే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కెసిఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు అగ్రనేతలను ఓడించిన ఈయనకు BJLP నేతగా అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతోంది. ఉత్తరాదిలో మూడు రాష్ట్రాల సిఎంల ఎంపిక తీరు పరిశీలిస్తే కామారెడ్డి ఎమ్మెల్యేకు చాన్స్ రావొచ్చని కమలం పార్టీలో విస్తృతంగా చర్చ జరగుతోంది. పార్టీ పరంగా తీసుకుంటే పార్టీ విధేయుడైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణకు ఇవ్వొచ్చు.

తెలంగాణ మీద ఫోకస్ చేసిన ఢిల్లీ పెద్దలు రాష్ట్రంలో పార్టీ విస్తరణకు, గెలుపునకు విశేష అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. దీనికి తోడు రాబోయే లోకసభ ఎన్నికల సమయంలో శాసనసభ పక్ష నాయకుడు కూడా ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మంచి వాగ్ధాటి ఉన్న నేతనే ఎన్నుకుంటారని తెలిసింది. రాజసింగ్ కు రాష్ట్రంలో అగ్రనేతలతో పోఅసాగాడు. మహేశ్వర్ రెడ్డి కూడా పార్టీ పరంగా కొత్తగానే వచ్చారు. దీంతో BJLP నేతగా కాటిపల్లి వెంకటరమణ రెడ్డికి ఇస్తే బాగుంటుందని రాష్ట్ర నేతలు బలపరుస్తున్నారని విశ్వసనీయ సమాచారం.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్