నాలుగున్నరేళ్ళ పదవీకాలంలో ప్రజలకు ఏం చేశామో సిఎం జగన్ భీమిలి సమావేశంలో వివరిస్తారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశంచేయడంతో పాటు ప్రజల్లో ఆత్మ స్థైర్యం పెంచేలా ఆయన ప్రసంగం ఉండబోతోందని చెప్పారు. వైసీపీ పార్టీ తరఫున రాష్ట్రాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించి ఐదు చోట్ల గ్రామ స్థాయిలోని గృహ సారథుల నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తూ సమావేశాలను ‘సిద్ధం’ పేరిట ఏర్పాటు చేస్తోంది. మొదటగా ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశం శనివారం 27న భీమిలిలో జరగనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో బొత్స మీడియాతో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ మెజార్టీ సీట్లలో విజయం సాధించిందని, వచ్చే ఎన్నికల్లోనూ అలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.
వైఎస్ షర్మిల మాటలు చూసి జాలికలిగిందని బొత్స వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబు చెప్పిన మాటలే ఆమె కూడా మాట్లాడారని, ప్రత్యేక హోదాకు ఎవరు తూట్లు పొడిచారో తెలియదా అని ప్రశ్నించారు. రాష్ట్ర అవసరాల కోసం ప్రధాని, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే తప్పేమిటని, ఇటీవల తెలంగాణ సిఎం కూడా మోడీ, అమిత్ షా లను కలిసిన మాట వాస్తవం కాదా అని అడిగారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేయాల్సి ఉంటుందని, కానీ ఎవరి విధానాలు వారికి ఉంటాయని పేర్కొన్నారు.
విపక్షాలకు కావాల్సింది అధికారం అయితే, తమకు ప్రజల సంక్షేమం- అభివృద్ధి ముఖ్యమని స్పష్టం చేశారు. జగన్ ను ప్రజలు ఎందుకు వద్దనుకుంటారో ఒక్క కారణం చెప్పాలన్నారు. 70రోజులు ఆగితే ఎవరు ప్యాకప్, ఎవరు మేకప్, ఎవరు వాకప్ అనేది తెలుస్తుందని ఎద్దేవా చేశారు.
మళ్ళీ సిఎం కావాలని బాబుకు ఉండొచ్చని కానీ ఆయన గత పాలనలో జరిగినదేమిటో ప్రజలు ఇంకా మర్చిపోలేదని… ఆయన పాలన అంతా మోసం, దగా, మాయ అని బొత్స విమర్శించారు.