Monday, January 20, 2025
HomeTrending NewsTelangana: తెలంగాణలో ఎన్నికల కోలాహలం...పార్టీల కదనోత్సాహం

Telangana: తెలంగాణలో ఎన్నికల కోలాహలం…పార్టీల కదనోత్సాహం

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు ప్రకటించటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. భారత రాష్ట్ర సమితి ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మంత్రులు కేటిఆర్, హరీష్ రావు లు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. ఏ జిల్లాకు వెళ్ళినా అక్కడ నేతలతో సమావేశాలు… అసంతృప్తులను బుజ్జగించి దారిలోకి తీసుకొస్తున్నారు.

అధినేత కెసిఆర్ ఆరోగ్యం బాగాలేకపోవటంతో కేటిఆర్, హరీష్ లు జోడేద్దుల్లా గులాబీ బండిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. పార్టీ అభ్యర్థులను ప్రకటించిన నాడు కొంత అసంతృప్తి జ్వాలలు కనిపించినా… దాదాపు అందరు దారిలోకి వస్తున్నారు. తాజా పరిస్థితి చూస్తుంటే కెసిఆర్ ఈ దఫా ప్రచారం ఎక్కువగా చేయకపోవచ్చు. అదే జరిగితే గులాబీ దండు ఎంతవరకు గెలుపు దిశగా సాగుతుందో చూడాలి.

బిజెపి పార్టీ అభ్యర్థుల లిస్టు తుది దశలో ఉందని సమాచారం. రెండు రోజుల్లో ఎదో ఒకరోజు కమలం అభ్యర్థుల జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో ఎంపి స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులలో అధిక శాతం ఈ దఫా శాసనసభ ఎన్నికల్లో అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నారు. బిజెపికి ఓటు వేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నా చాల నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఆ పార్టీకి ఉంది.

పేస్ వాల్యూ ఉన్న నేతలు బిజెపికి అంతగా లేకపోవటంతో ఎంపిగా పోటీ చేసిన వారిలో ఎక్కువమంది అసెంబ్లీ ఎన్నికల్లో తలపడేందుకు సిద్దం అవుతున్నారు. ఇది ఒక రకంగా ప్రయోగమనే చెప్పాలి. ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో వేచి చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తర్వాత పార్టీ శ్రేణులలో ఉత్సాహం పెరిగింది. ఎన్నికల కోసం ప్రకటించిన కమిటీలలో అసంత్రుప్తులుగా ఉన్న వారికి ఎక్కువగా పదవులు ఇచ్చారు. దీంతో కొంత సజావుగా ఉన్నట్టు కనిపించినా… ఎన్నికల గోదాలోకి దిగితే గానే ఎవరు ఏంటి అనేది చెప్పలేని వాతావరణం బిజెపిలో ఉంది.

కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక కోసం హస్తినలో దఫా దఫాలుగా సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ లో ఈ దఫా గెలుపు మీద ధీమాతో పనిచేస్తున్నారు. ఈ మధ్య అసంతృప్తి స్వరాలూ కూడా అంతగా వినిపించటం లేదు. ఇతర పార్టీల నుంచి నేతల వలసలు పెరగటంతో హస్తం నేతలు కదనోత్సాహంతో ఉన్నారు. కాంగ్రెస్ కూడా ఈ రెండు రోజుల్లో అభ్యర్థుల మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది.

తరాలు మారినా మా ధోరణి మారదు అన్నట్టు ఢిల్లీ కేంద్రంగానే కాంగ్రెస్ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ విధానమే పార్టీకి ఇబ్బంది కలిగించవచ్చు. కాంగ్రెస్ కొంత చురుకుగా మారితే… ఆ పార్టీ నేతలు ఢిల్లీ విమానాల్లో చక్కర్లు కొట్టడమే తరువాయి.  పార్టీ రాష్ట్ర ఇంచార్జులు ఉన్నా కేసి వేణుగోపాల్ స్వయంగా తెలంగాణ వ్యవహారాలు చూస్తున్నారు. ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు. ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ ఎంతవరకు అందిపుచ్చుకుంటుందో డిసెంబర్ మూడు వరకు వేచి చూడాలి.

మజ్లీస్ పార్టీ మరింత విస్తరించేందుకు ప్రణాలికలు సిద్దం చేస్తోంది. అంబర్పేట్, జుబ్లీ హిల్స్ లో పతంగి ఎగురవేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బిఎస్పి తెలంగాణ ప్రజలను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. కోదండరాం పార్టీ తెలంగాణ జన సమితి ఇక చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోంది. ఈ రోజు వరకు ఉన్న పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ – బీఆర్ ఎస్ ల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్