Saturday, September 21, 2024
HomeTrending NewsDharani: కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Dharani: కేసీఆర్ పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కేసీఆర్ నాయకత్వంలోని బారసా పాలనలో రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యం అయిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజలకు తోడుగా నిలిచేది రెవెన్యూ వ్యవస్తేనని అందులో క్షేత్ర స్థాయిలో పని చేసే వీఆర్వో, వీఆర్ఏలను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రెవెన్యూ వ్యవస్థ ప్రభుత్వానికి కండ్లు, చెవులని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, వివరాల సేకరణ, కులం, నివాస, కుటుంబ సర్టిఫికేట్, కళ్యాణ లక్ష్మి పథకాలు అమలులో క్షేత్ర స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ కీలకమని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో అధికారులకు గ్రామస్థాయిలో తోడుగా నిలిచేది వీఆర్ఓ, వీఆర్ఎలు మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో  అదనంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి, కనీసం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయడం లేదని, ఉన్న ఉద్యోగాలను రద్దు చేసి నిరుద్యోగుల పొట్టగొడుతున్నరని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతోపాటు అదనంగా ఉద్యోగాలు పెరుగుతాయని భావిస్తే కనీసం 23 ఉద్యోగాలు కూడా కొత్తగా భర్తీ చేయలేదని ద్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యార్థుల చేరిక తగ్గిపోతుందన్నారు. రేషనలైజేషన్ నెపంతో ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయకపోగా కనీసం పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదని ఇదేనా అంటూ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు.
ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉండగా వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో వీఆర్వో పోస్టులు18 వేలు వీఆర్ఎ పోస్టులు 22 వేలు పోస్టులు సర్దుబాటు చేసి 40 వేల ఉద్యోగాలు కనుమరుగు చేశారని ఆయన విమర్శించారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయకుండా వీఆర్ఓ, వీఆర్ఏలను రద్దు చేసి రెవెన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేశారని జీవన్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లుగా వీ ఆర్ ఎ లు ఉద్యమించడంతో ఎట్టకేలకు ప్రభుత్వం వీఆర్ఎలను క్రమబద్దీకరించడంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

నేడు ధరణితో ఎకరానికి రు.2500 ఫీజు వసూలు చేస్తు రైతులపై అదనపు భారం మోపుతున్నారని ఆరోపించారు. ధరణితో సామాన్యులపై మరింత భారం వేస్తున్నారని చెబుతూ దరణికి, రైతుబందుకు సంబంధం ఏమిటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. గ్రామాల్లో అధికారులు విచారణకు వెళ్తే వీఆర్ఓ, వీఆర్ఏలు సహకారం అందించేవారని గుర్తు చేశారు. వీఆర్ఎ లను లష్కర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టంట్ లుగా నియమించనుండడంతో డిగ్రీ చదివిన దళిత వీఆర్ఏలు తహసిల్డార్ గా పదోన్నతి పొందే అవకాశాలు కోల్పోతున్నారని జీవన్ రెడ్డి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. వీఆర్ఎ, వీఆర్ఓలను రెవెన్యూ శాఖలో తిరిగి కొనసాగించడం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరిచి అమలు చేస్తామని, రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ పనితనాన్ని మెరుగు పరుస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్