Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంరోగనిరోధక శక్తే శ్రీరామ రక్ష

రోగనిరోధక శక్తే శ్రీరామ రక్ష

Word For Good Immunity :

కరోనా ఉధృతి పెరిగిన తరువాత సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఎన్నో పోస్టుల్లో ఒకానొక పోస్టు ఇది. నిలువ ఉన్న ఆహారం, ప్యాక్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం, యంత్రమయ జీవనం ఎన్నో రోగాలకు కారణం. ఆ కోణంలో ఈ పోస్టును చివరిదాకా చదవండి. సమంతా చెప్పే ఉప్పు జ్ఞానంతో పోలిస్తే – ఇది పనికొచ్చే జ్ఞానమే. అజ్ఞాత రచయిత సౌజన్యంతో-

ప్రతిరోజూ ఎంతోమంది తెలిసినవాళ్లు కరోనాతో పోతున్నారు. ప్రతిరోజూ ఎన్నో చావు వార్తలు వింటున్నాం. ఎక్కడ చూసినా భయం రాజ్యమేలుతోంది. రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియడంలేదు. ఇదంతా చూస్తూ, “అసలు కరోనా ఎందుకొస్తోంది?” అన్న ప్రశ్న ఎవరినడిగినా ఒకటే చెబుతారు.

‘వైరస్’ వల్ల వస్తున్నది’
చాలామంచి జవాబు.
‘మరి వైరస్ అందర్నీ కాటేయడం లేదేంటి?’
‘ఇంట్లో జాగ్రత్తగా ఉంటే రాదు’
ఇది కూడా చాలామంచి జవాబే.
‘మరి ఇంట్లో ఉన్నవాళ్లకు కూడా చాలామందికి వస్తోంది కదా? ఇదేంటి?’
‘గాలిలో వస్తోంది’
అదే గాలిని అందరూ పీలుస్తున్నారు కదా? మరి అందరికీ రావడం లేదెందుకు?
‘రోగ నిరోధక శక్తి లేనివాడికి వస్తోంది’
‘రోగ నిరోధక శక్తి ఎందుకు తగ్గుతోంది?
‘తెలియదు’

ఇప్పుడు ఇంకో కోణం చూద్దాం.
‘మా మామయ్య కూరగాయలకని మార్కెట్టుకి వెళ్ళొచ్చాడు. అక్కడ సోకింది’
మరి అక్కడే ఉంటూ, రోజంతా కూరగాయలు అమ్ముతున్నవాడికి ఎందుకని రావడం లేదు?
నో ఆన్సర్
‘మా బాబాయి పాలప్యాకెట్ కని బయటకెళ్ళి వైరస్ అంటించుకున్నాడు’
‘మరి రోజంతా అదే షాపులో పాలప్యాకెట్లు అమ్ముతున్నవాడికి ఎందుకని రాలేదు?’
మళ్ళీ నో ఆన్సర్
‘మా నాన్న వద్దంటున్నా వినకుండా బయటకెళ్ళి మామిడిపండ్లు కొన్నాడు. అక్కడ సోకి ఉంటుంది’
‘రోజంతా ఎండలో రోడ్డుపక్కన కూచుని పండ్లు అమ్ముతున్న ఆమెకు ఎందుకని కరోనా సోకలేదు?’
మళ్ళీ నో ఆన్సర్
చివరకు ఇలా జవాబు వస్తుంది.
‘కాయకష్టం చేసేవాళ్లకు రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకని వాళ్లకు రాదు’

ఏతావాతా తేలిందేమిటి? ఎవడికైతే రోగనిరోధకశక్తి ఎక్కువగా ఉంటున్నదో వాడికి కరోనాయే కాదు. ఏ వైరసూ సోకదు. ఏ బాక్టీరియా సోకదు. ఏమీ కాదు.
డా || హానిమన్ ఈ మాటను రెండు వందల ఏళ్ళక్రితం చెప్పాడు. ఆయుర్వేద సృష్టికర్తలైన ఋషులు వేల ఏళ్ళనాడే ఈ మాటను చెప్పారు. అంతేగాక ఏమేం చేస్తే, ఎలా బ్రతికితే, రోగనిరోధకశక్తి బాగుంటుందో కూడా చెప్పారు. ఏం చేస్తుంటే అది క్షీణిస్తుందో కూడా చెప్పారు. వినేవారేరీ? వింటే, జనం పోగుచేసుకుంటున్న చెడుకర్మను ఎవడనుభవిస్తాడు? అందుకే మంచి చెప్పినా ఎవడూ వినడు. వినలేడు. విన్నట్టు విని వదిలేస్తాడు గాని ఆచరించలేడు. కనుక వాడి ఖర్మ వాడిని వెంటాడుతుంది. గొంతు పట్టుకుంటుంది. తీసుకుపోతుంది. అదంతే !

ఇప్పుడు విషయంలోకొద్దాం.

నేనింతవరకూ ఓవెన్ ను కొనలేదు. ఎందుకో తెలుసా? దానివల్లనే అమెరికాలో పెద్దప్రేగు కాన్సర్ వస్తున్నదని తెలిసింది గనుక. నేనమెరికాలో ఉన్నపుడు ఒక విషయం గ్రహించాను. అమెరికాలో పొట్ట కేన్సర్లు చాలా ఎక్కువ. ఎందుకని?

వినండి మరి.

స్టోర్స్ లో ఉన్న మాంసం ఎన్నో రోజులనుంచీ డీప్ ఫ్రిజ్ లో ఉంటుంది. మైనస్ డిగ్రీలలో ఉంటుంది. దాన్ని తెచ్చి, ఓవెన్లో పడేసి ఒకేసారి 160 ఫారెన్ హీట్ దాకా వేడిచేసెసి తింటారు. ఒకేసారి అంత టెంపరేచర్ తేడా వస్తే ఆ మాంసంలో ఏమౌతుంది? పైగా, మంటపైన, కుండలో వండితే జరిగే ప్రక్రియ వేరు. అక్కడ ఆక్సిజన్ పుష్కలంగా ఉంటుంది. ఓవెన్ లో ఏ ఆక్సిజన్ ఉంటుంది? ఒక ఉదాహరణ చెప్తాను, వినడానికి అసహ్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం.

చనిపోయిన దేహాన్ని మార్చురీలోని కోల్డ్ స్టోరేజిలో ఉంచడానికి, మాంసాన్ని, కూరగాయలను ఫ్రిజ్ లో ఉంచడానికి తేడా ఏంటి? అలాంటి శవాలను తెచ్చి, కనీసం వాటిని కట్టెలమీదకూడా ఉడికించకుండా, ఆక్సిజన్ లేని, అదసలు అవసరంలేని, మైక్రో వేవ్స్ క్రింద ఓవెన్లో ఉడికిస్తే ఏమౌతుంది? వాటిల్లో ఏయే మార్పులొస్తాయి? తినేవాడికి కాన్సర్లు రాక ఏమౌతుంది? చెప్పండి.

ఈరోజుల్లో, ఏ పూటకాపూట, ఏరోజు కూరగాయలను ఆరోజున వేడివేడిగా వండుకుని, ఏపూట అన్నం ఆపూట వేడిగా వండుకుని ఎవరు తింటున్నారు? చెప్పనా? రోజుకూలీలు తింటున్నారు. కాయకష్టం చేసుకునేవాళ్ళు తింటున్నారు.

వాళ్ళు ఏరోజుకు ఆరోజున కూరగాయలు తెచ్చుకుంటారు. మంటమీద వండుకుని తింటారు. ఓవెన్ వాడరు. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు. సుఖానికిపోయే సంపన్నులు, ఫ్రిజ్ లో వారాల తరబడి ఆహారాన్ని మురగబెట్టుకుని తినేవాళ్లు, ఓవెన్లు వాడేవాళ్లు రోగాల పాలౌతున్నారు. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ వంట చెయ్యదానికి బద్ధకిస్తూ, పొద్దున్నే ఒకేసారి అన్నీ వండిపారేసి, వాటినే రాత్రికి పెట్టుకుని తినేవాళ్లు రోగాలపాలౌతున్నారు.

ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుని లొట్టలేసుకుంటూ మింగే తిండిలో ఏముంటుందో మీకు తెలుసా? అదెప్పటి ఆహారమో మీకు తెలుసా? ఈ రోజున మిగిలిపోయిన ఫుడ్ ని ఏ హోటలువాడూ పారెయ్యడు. రేపు, ఎల్లుండి, ఎంతవరకూ దానిని ఉంచగలిగితే అంతవరకూ ఫ్రిజ్ లో ఉంచి, ఓవెన్లో ఇన్ స్టంట్ గా వేడిచేసి మీకు పంపిస్తాడు. ఆ కుళ్లిపోయిన వేడివేడి ఆహారాన్ని లొట్టలేసుకుంటూ మీరు మింగుతారు. దానికితోడు, వాడు ఫ్రీగా ఆఫర్లో పంపించే కూల్ డ్రింక్ ఉండనే ఉంటుంది. అది యాసిడ్. ఇక మీకు రోగాలు రాక ఏమౌతాయి మరి?

యాసిడ్ తో కడగాల్సింది టాయిలెట్ ని. పొట్టని కాదు. ఆఫ్కోర్స్, ఈ రోజుల్లో టాయిలెట్ కమోడ్ కీ పొట్టకీ పెద్ద తేడా ఉండటం లేదనుకోండి. ఇంకా చెప్పాలంటే కమోడే శుభ్రంగా ఉంటోంది. ఎప్పటికప్పుడు క్లిన్ చేస్తాం కాబట్టి. మన పొట్టే దానికంటే అసలైన దరిద్రం !

ప్రతిరోజూ చెమటపట్టేలా వ్యాయామం ఎవరు చేస్తున్నారు? ఏసీ జిమ్ముల్లో అమ్మాయిలూ అబ్బాయిలూ ఎగరడం కాదు. చక్కటి ఎండలో, ఆరుబైట గాలిలో ఎవరు వ్యాయామాలు చేస్తున్నారు? ఆ చేసే వ్యాయామాలు మాత్రం ఏమిటి? కండలు పెంచే జిమ్ము వ్యాయామాలు. అవి రోగనిరోదకశక్తిని పెంచగలవా? లేవు. ఏడాదిపాటు పెంచిన కండలు, ఒక్క జ్వరంతో కరిగి వేలాడటం మొదలుపెడతాయి. మరెందుకవి? మనదైన యోగాభ్యాసాన్ని శుద్ధంగా చేస్తున్నవారెందరు?

అసలు కనీస వ్యాయామమంటూ ఏదో ఒకదాన్ని ఏడుస్తున్నవారెందరు? ఎవరూ లేరు. పొద్దున్న పదింటికి నిద్ర లేవడం, ఆ సోఫాలోనో, బెడ్ మీదనో రోగిష్టిలాగా పడుకుని, టీవీనో, మొబైల్ నో చూస్తూ, ఫోన్లో సొల్లు వాగుతూ ఉండటం, టైమైతే జొమాటో ఆర్డర్ పెట్టడం, తిని మళ్ళీ మొబైల్లోకి చూస్తూ పడుకోవడం. లేకపోతే ఆ ఫ్రిజ్ లో కుక్కిన పదిరోజులనాటి చెత్తను మింగడం. ఇది మన దినచర్య. ఇక రోగాలు రాక మరేమొస్తాయి?

ఏదో రోగం వచ్చినపుడు కూడా ప్రకృతిసిద్ధమైన మందులు వాడకుండా, సింథటిక్ ముందులు వాడటం. అక్కడకూడా డబ్బులు పారేసి పెద్ద ఆస్పత్రిలో చేరి దేహాన్ని వారికి అప్పజెప్పడం. అదృష్టం బాగుంటే ప్రాణంతో తిరిగి రావడం, లేదా శవంగా బయటకు రావడం. దహనం కూడా ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో. ఇదీ మన బ్రతుకు.

వినడానికి అసహ్యంగా ఉంటుందని ముందే చెప్పాను. ఎప్పుడైనా చూశారా మీరు? మామూలుగా దహనం చేసిన శవం బూడిద ఎలా ఉంటుందో? తెల్లగా ఉంటుంది. ఎలక్ట్రిక్ క్రిమటేరియంలో వచ్చే బూడిదను ఎప్పుడైనా చూశారా? నల్లగా ఉంటుంది. ఆక్సిజన్ లేకుండా పెనంమీద అట్టు మాడినట్లు శవం అందులో మాడిపోతుంది. అది అసహజ ప్రక్రియ. బ్రతికున్నపుడూ అసహజంగా బ్రతకడం, చావులో కూడా అసహజమే. ఇది మానవజాతి చేతులారా చేసుకుంటున్న ఖర్మ కాకపోతే మరేంటి?

సినిమాలు చూసి, ఫుడ్ కంపెనీల యాడ్స్ మాయలో పడి, మోడరన్ లైఫ్ ఉచ్చులో ఇరుక్కుని మనుషులు సర్వనాశనం అవుతున్నారు. అవండి. మిమ్మల్ని ఎవడూ కాపాడలేడు.

అసలు మన దేశంలో ఫ్రిజ్ ఎందుకు? అవసరమా? మనకు ఓవెన్లెందుకు? అవసరమా? మనకు  ఆన్ లైన్ తిండి ఎందుకు? అవసరమా? అమెరికావాడి తిండి మనకెందుకు? అవసరమా? రోజంతా కదలకుండా పందుల్లాగా పడుకుని టీవీలు, మొబైళ్ళు చూడటం మనకెందుకు? అవసరమా? అర్ధరాత్రిళ్ళు, తెల్లవారుఝామున నానాచెత్త తిండి తినడం అవసరమా? ఏదీ అవసరం లేదు. ఇదేదీ సహజం కాదు. మరి ఇన్ని అసహజమైన, ప్రకృతి విరుద్ధమైన పనులు ప్రతిరోజూ చేస్తూ, మన రోగనిరోధకశక్తి గట్టిగా ఉండాలంటే ఎలా ఉంటుంది?

పోనీ మనసన్నా శుద్ధంగా ఉంటున్నదా ?

ఓర్వలేనితనం, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, కోపాలు, అహంకారాలు, గర్వాలు, ధనమదం, కులగర్వం, ఆశ, నాటకాలు, వేషాలు, పొగరు, లెక్కలేనితనం, అన్నీ నాకే తెలుసన్న మదం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో మన మనస్సులో ఉన్న దయ్యాలు.

ఒళ్ళూ కుళ్లిపోతూ, మనసూ కుళ్లిపోతూ, పైకిమాత్రం ‘అంతా భలేబాగుంది’ అనుకుంటూ మొహానికి మాత్రం క్రీములు పూసుకుంటూ, ఒళ్ళు అందరికీ చూపించుకుంటూ బ్రతుకుతున్న ఇలాంటి స్థితిలో కరోనా ఎందుకు? గట్టిగా ఒక చిన్న గాలివీస్తే చాలు మనం నేలకూలిపోవడానికి.

ఏవిధంగా మనం ఆరోగ్యవంతులం అసలు?

మనల్ని చంపడానికి కరోనాయే అవసరం లేదు. చిన్న సూది గుచ్చుకుంటే కూడా, కుప్పకూలిపోయి, ప్రాణాలు పోయే రోజులు ముందున్నాయి. కూచున్నవాడు కూచున్నట్టు, నుంచున్నవాడు నుంచున్నట్టు, నడుస్తున్నవాడు నడుస్తూనే చనిపోయే రోజులు ముందున్నాయి.

బ్రహ్మంగారు వ్రాసినది అబద్ధం కాదు ! కాకపోతే బ్రహ్మంగారి గుడి కట్టించి పూజించేవాడు కూడా ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదు. ఆయన ఏదైతే వద్దన్నారో అదే చేస్తున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడినని చెప్పుకుంటున్నాడు. అదీ అసలైన వింత !

బుద్ధి కర్మానుసారిణి. ఎవడాపగలడు? ఎవడెన్ని చెప్పినా, ఎంత మంచిని చెవిలో వినిపించినా, ఎవడూ వినడు. ఆచరించడు. పోగాలం వచ్చినపుడు ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది?

Must Read : నేరం నాది కాదు!

RELATED ARTICLES

Most Popular

న్యూస్