Saturday, January 18, 2025

అహో వూహాన్!

China says Wuhan lab To Be nominated for Top Science Award In China :

చరిత్రలో కొన్ని నిలిచిపోతాయి. వాటికి ఉపోద్ఘాతం, వ్యాఖ్యానాలు అనవసరం.

ఒక హిరోషిమా
ఒక నాగసాకి
అలా ఒక వూహాన్

ఆధునిక ప్రపంచ చరిత్రలో భూగోళాన్ని తలకిందులు చేసిన కరోనా వైరస్ చైనాలో వూహాన్ ప్రయోగశాలలో కృత్రిమంగా పుట్టించిందని నమ్మేవారు వందల కోట్లల్లో ఉంటారు. ఏదో జీవాయుధం చేయబోతే అది అదుపు తప్పి ప్రపంచమంతా విస్తరించిందన్నది ఒక వాదన. ఈ వాదనను శాస్త్రీయమయిన ఆధారాలతో రుజువు చేస్తామని సవాలు విసురుతున్న శాస్త్రవేత్తలు కోకొల్లలు.

అబ్బే…అదంతా మీ అనుమానం…అంతే…అలాంటిదేమీ లేదు…అని చైనా కొట్టి పారేస్తూ ఉంటుంది. ఇందులో నిజానిజాలు గబ్బిలాలకెరుక. వూహాన్ ప్రాంతంలో చైనీయులు తిన్న కప్పలు, ఎండ్రకాయలకెరుక. మన్ను తిన్న పాములకెరుక. తిన్న విషపు తేళ్లకెరుక. ఇంకా తిన్న నానా క్రిమికీటకాలు, పశు పక్ష్యాదులకెరుక. చెబితే కడుపులో దేవినట్లు ఉండే ఎన్నెన్నో సజీవ తిళ్లకెరుక.

భూగోళం కరోనా మూడో దశ ముంగిట్లో వణుకుతూ ఉంది. ఇంతటి కరోనా భూతాన్ని సృష్టించినట్లుగా లోకం అనుమానిస్తున్న వూహాన్ ల్యాబ్ కు చైనా అత్యున్నత శాస్త్రీయ అవార్డు ఇవ్వాలని చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నామినేట్ చేసింది.

కోవిడ్ కు కారణాలపై వూహాన్ ల్యాబ్ అత్యుత్తమ పరిశోధనలు చేసినందుకు గుర్తింపుగా ఈ అతి గొప్ప ఊహాతీత గౌరవం ఇవ్వడం సముచితమని చైనా మేధావులు అనుకుంటున్నారు. చైనా అధినేతలు కూడా అలాగే అనుకుని ఉండాలి. అధినేతల మనసులో మాటే అక్కడి బుద్ధి జీవులు కూడా బుద్ధిగా అనాలి.

“అహో వూహాన్!
ఓహో వూహాన్!
నీ లీలలు ఊహాతీతం!
నీ మాయలు హాహాకారం!”

అని ప్రత్యేక గీతాలు కూడా బాణీలు కట్టి చైనా పాడుతోంది. ప్రపంచమంతా వూహాన్ ను అనుమానిస్తూ బోనులో నిలబెడుతున్న వేళ- చైనా వూహాన్ ను ఆకాశానికెత్తడంలో ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎంతయినా అది చైనా. ఎటునుంచైనా అది చైనా. ప్రపంచాన్ని ముంచయినా అది చైనా.

ఇంతకూ వూహాన్ లో జరిగిందేమిటో ఎవరి ఊహకు తోచింది వారు ఊహించుకోవాల్సిందే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : కరోనాలో ‘LAMBDA’ అనే కొత్త వేరియంట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్