తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) ట్రస్టు బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వై.వి. సుబ్బారెడ్డి మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించగానే జూన్ లో టిటిడి బోర్డు చైర్మన్ గా రెండేళ్ళ కాలపరిమితితో వైవీ సుబ్బారెడ్డి ని నియమించారు. తర్వాత కొంత కాలానికి బోర్డు సభ్యులను నియమించారు. ఆ బోర్డు పదవీకాలం 2021 జూన్ 21 నాటికి ముగిసింది. ఆ తర్వాత ఈవో అధ్యక్షతన స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మరోసారి వైవీకే టిటిడి ఛైర్మన్ పదవి ఇస్తారని వార్తలు వచ్చినప్పటికీ అయన క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాడానికి మొగ్గు చూపుతున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీనితో అయన నియామకం కాస్త ఆలస్యమైంది. ఇప్పట్లో రాజ్యసభ, మరే ఇతర కీలక పదవుల భర్తీకి అవకాశం లేకపోడంతో వైవీకి తిరిగి టిటిడి పగ్గాలు అప్పజెప్పారు. బోర్డు సభ్యులను త్వరలో నియమిస్తారు. ఈ వారంలోనే వైవీ ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిసింది.