రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ప్రస్తుతం అది 15 శాతంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడి పోయిందని, పరిశ్రమలు పెట్టాలంటే భయపడే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. వైసీపీ పేరు చెబితేనే పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని, దీనీతో ప్రైవేటు సెక్టార్ లో పెట్టుబడులకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయిందని యనమల అన్నారు.
అధికార పార్టీ నేతల దోపిడీతో ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడుతోందని, పేదలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాల్లో సైతం చేతివాటం చూపుతున్నారని మండిపడ్డారు. 2020-21 ఆర్ధిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కేవలం 638. 72 కోట్ల రూపాయలు మాత్రమేనని, జాతీయ స్థాయిలో ఇది ఒక శాతం కూడా లేకపోవడం దారుణమన్నారు యనమల. సెజ్ లు, పోర్టులు, ప్రభుత్వ భూములన్నీ సిఎం జగన్ బినామీల పరం అయ్యాయన్నారు.