రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నదని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశమున్నది. ఉత్తర, ఈశాన్య మధ్య తెలంగాణ జిల్లాలకు వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. హైదరాబాద్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. పగలు సాధారణ పరిస్థితి ఉన్నా సాయంత్రానికి వాతావరణం మారుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మెదక్ జిల్లా కౌడిపల్లి, రామాయంపేటలో 6 సెంటీమీటర్లు, హైదరాబాద్ జిల్లా షేక్‌పేటలో 5, సంగారెడ్డి జిల్లా మునిపల్లి, రాయ్‌కోడ్, నిజామాబాద్ జిల్లా కోటగిరి 5, సంగారెడ్డి జిల్లా నాయ్‌కల్, మెదక్ జిల్లా నర్సాపూర్, నారాయణపేట జిల్లా ఊట్కూర్, కామారెడ్డి, వికారాబాద్ జిల్లా మార్పల్లిలో 4 సెంటీమీటర్ల చొప్పున, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 3, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో 3, హైదరాబాద్ జిల్లా గోల్కొండలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.