Friday, March 29, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంబిగ్ వీల్ గర్ల్ ... యోగితా

బిగ్ వీల్ గర్ల్ … యోగితా

The Real Wheel:  “చాలా పవర్ ఫుల్ అట…అతనే చక్రం తిప్పుతున్నాడని భోగట్టా”….  ఇలా చక్రాలు తిప్పే భాష తెలుగు దినపత్రికలు చదివే వారికి బాగా ఎరుకే. పేజీలన్నీతిరగేస్తే చాలా చక్రాలే తిరుగుతుంటాయి. కానీ నాకర్ధమయ్యేది కాదు. ఎవరైనా పవర్ ఫుల్అవడానికీ… చక్రాలు తిప్పడానికీ లింకేమిటో, అసలా చక్రాలేమిటో అవి ఎక్కడుంటాయో, ఎలా తిప్పాలో, తిప్పితే పవర్ ఎలా పుట్టుకొస్తుందో అర్ధంగాక బుర్ర మాత్రం తిరిగి పోయేది. తెలిస్తే ఒకటో రెండో చక్రాలు నేనూ ఆర్డర్ చేద్దామని తిప్పడానికి కండలు పెంచేసి, చూసి చూసి నిరాశే మిగిలింది.

‘హెవీట్రక్ చక్రం (స్టీరింగ్ వీల్) ముందు కూచుంటే నేను అత్యంత శక్తిమంతురాలిగా ఫీల్ అవుతా‘ నని యోగితా రఘువంశి  చెప్పినప్పుడు మాత్రం భలేగా అనిపించింది. భారతదేశంలో మొదటి స్త్రీ ట్రక్ డ్రైవర్ గా యోగితా గురించి ఈ మధ్యకాలంలో పలు కథనాలు వచ్చాయి. గూగుల్లో చూస్తే, అంతకు ముందు కూడా ఒకరిద్దరు ఉన్నట్లు తెలిసింది. అయినా మొదటి వందమందీ… కాదు వెయ్యి మందైనా సరే మొట్టమొదటి స్త్రీ అనే గౌరవానికి అర్హులే. ఎందుకంటే ఆ ఫీల్డ్ అలాంటిది.  అయితే, ఈ కథనం రాయడానికి ఆ ఫీల్డ్ గానీ, మొదటి స్త్రీ ట్రక్ డ్రైవర్ అనే ఆకర్షణీయమైన అంశం గానీ కారణాలు కావు. యోగితా అన్న ఒక్క మాటవల్ల ఈ కథని మళ్ళీ చెప్పొచ్చు అనిపించింది.

Yogitha Raghuvamshi

యు ట్యూబ్ లో దిక్కుమాలిన ప్రకటనలెన్నో. కానీ షెల్ ఇండియా కంపెనీ అడ్వర్టైజ్మెంట్  కాంపెయిన్ “గ్రేట్ థింగ్స్ హాపెన్ వెన్  ఉయ్ మూవ్ ” లో భాగంగా యోగితా రియల్ స్టోరీని పరిచయం చేసిన యాడ్ చూశా. భర్త చనిపోయాక పిల్లల బాధ్యతని  తలకెత్తుకుంది, లా చదివిన యోగితా. జూనియర్ లాయర్ గా పెద్దగా ఆదాయం లేకపోవడం, భర్తకి చిన్న సైజు ట్రక్ బిజినెస్ ఉండటంతో దాన్ని నడిపే ప్రయత్నంలో ట్రక్ నీ నడిపింది. పూర్తి ప్రొఫెషనల్ హెవీ ట్రక్ డ్రైవర్ గా మారింది.

ఇండియాలోనే కాదు ప్రపంచమంతటా కొన్ని పనులు పురుషులే చెయ్యాలి లేదా చెయ్యగలరు అనే భావన ఉంది. హెవీ ట్రక్ డ్రైవింగ్ కూడా అలాంటిదే. అలాంటి స్టీరియో టైపు భావాల్నియోగితా బ్రేక్ చెయ్యడమే కాకుండా దాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం, ప్రతికూలతలని తట్టుకోవడం చూస్తే ఒక గొప్ప సందేశమే. అంతకుమించి జీవితంలో ఎంతమంది ఎన్ని రకాలుగా సవాళ్ళని ఎదుర్కొంటున్నారో అనే స్ఫూర్తి కలుగుతుంది.

మధ్యప్రదేశ్ పార్వతీ ఆర్య ఆసియాలోనే మొదటి స్త్రీ ట్రక్ డ్రైవర్ గా గిన్నిస్ రికార్డ్ స్థాపించింది. తమిళనాడు జ్యోతిమణి కూడా పత్రికలను ఆకర్షించిన ట్రక్ డ్రైవర్. ఒక స్త్రీ, హెవీ ట్రక్ డ్రైవర్ గా ఎన్ని కష్టాలు పడుతుందో, కుటుంబం నుండీ, సమాజం నుండి ఎలాంటి వ్యతిరేకత చవి చూస్తుందో, ఎన్నెన్ని ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటుందో, దూర ప్రయాణాల్లో ఎన్ని అసౌకర్యాలుంటాయో, ఎంత మానసిక సంఘర్షణ పడుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. అందుకే వీరంతా నా దృష్టిలో ఎవరూ నడవని దారిలో నడిచే సాహసంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ స్పేస్ లెజండ్ కల్పనా చావ్లా, ఇండియన్ ఎయిర్  ఫోర్స్ లో సోలో ఫైటర్ పైలట్ అవని చతుర్వేది, కార్గిల్ గర్ల్ గుంజన్ సక్సేనాలకు ఏమాత్రం తీసిపోరు.

కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. వర్క్ ఫ్రం హోం  న్యూ నార్మ్ అయ్యింది. మళ్ళీ ఆఫీస్ కి రమ్మంటే, ఉద్యోగాలు సైతం మానేసే ట్రెండ్ చూస్తున్నాం. అయితే, అమెరికాలో రెస్టారెంట్లూ, మాల్స్ లో పనిచేసే స్త్రీలు కొంతమంది ట్రక్ డ్రైవింగ్ తమ ప్రొఫెషన్ గా ఎంచుకోవడం కొసమెరుపు. భార్యా భర్తలు కలిసి ట్రక్ డ్రైవర్స్ గా పని చేస్తున్న సందర్భాలూ పెరుగుతున్నాయి. అమెరికాలో దాదాపు నలభై లక్షల ట్రక్ డ్రైవర్స్ ఉంటే అందులో 7 శాతం స్త్రీలున్నారు. వాళ్ళందరి కోసం వుమెన్ ఇన్ ట్రక్కింగ్ అనే సంస్థ పనిచేస్తోంది. ఈ రంగంలోకి స్త్రీలను ప్రోత్సహించడానికి అమెరికా ఏకంగా ఓ చట్టమే చేసి వుమెన్ ఆఫ్ ట్రక్కింగ్ బోర్డ్ ని స్థాపించింది.

స్పేస్ లోకి వెళ్ళిన రాకేశ్ శర్మని ‘పైనుండి చూస్తే భారతదేశం ఎలా అనిపిస్తోంది’ అని ఇందిరాగాంధీ అడిగింది. దానికిరాకేశ్  శర్మ “సారే జహా సే అచ్చా” అని స్పేస్ లో ఉన్నప్పుడు చెప్పడం ఆ రోజుల్లో ఒళ్ళు గగుర్పోడిచిన సందర్భం.

యోగితా హెవీ ట్రక్ తో తన అత్యంత దూర ప్రయాణం భోపాల్ నుండి బయలుదేరి కేరళ, అక్కడినుండి జమ్మూ, జలంధర్, ఇండోర్ మీదుగా మళ్ళీ భోపాల్ వరకు అంటే దాదాపు 6800 కిలోమీటర్లు కేవలం పదిరోజుల్లో పూర్తి చేసి ఓ మాట చెప్పింది… “మన భారతదేశం చిన్న దేశం. ఇంకా పెద్దదైతే బాగుండేది కవర్ చెయ్యడానికి” అని. చదవగానే ఒళ్ళు జలదరించింది. ఈ మాటే నన్ను ఈ కథనం రాయడానికి ప్రేరేపించింది.

Yogitha Raghuvamshi

ఒక సాహసం ముందు, ఒక సంకల్పం ముందు, ఒక ఆత్మవిశ్వాసం ముందు, ఎంత పెద్ద సవాలైనా చిన్నదే. ఒక హనుమంతుని ముందు హిందూ మహా సముద్రమూ, ఒక యోగితా ముందు భారతదేశ భోగోళిక వ్యాప్తీ చిన్నవే. గుంజన్ సక్సేనా జీవిత కథ కార్గిల్ గర్ల్ సినిమా గా వచ్చింది. యోగితా కథ బిగ్ వీల్ గర్ల్ గా రాదగినదే. అసలు చక్రం తిప్పేది యోగితానే అనే టాగ్ లైన్ తో.

– విప్పగుంట రామ మనోహర

Also Read : 

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు…..

RELATED ARTICLES

Most Popular

న్యూస్