Friday, November 22, 2024
HomeTrending Newsపెన్షన్ పంపిణీలో మళ్ళీ కుట్రలు : బాబు ఆగ్రహం

పెన్షన్ పంపిణీలో మళ్ళీ కుట్రలు : బాబు ఆగ్రహం

పెన్షన్ల పంపిణీలో మరోసారి కుట్రలకు తెరతీసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని…దీనికి కొంతమంది అధికారులు వత్తాసు పలుకుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో వైసీపీ తీరుతో 33 మంది వృద్ధులు ప్రాణాలు కోల్పోయారని, ఈసారి కూడా మరో తరహా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కర్నూలులో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

పెన్షన్లు ఈసారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని చెప్పడం దారుణమని, మొత్తం 65 లక్షల 49 వేల మంది పెన్షనర్లు ఉంటే వారిలో 75 శాతం మందికి ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ లింకేజ్ ఉంది కాబట్టి దానిలో వేస్తామని అంటున్నారని, అంటే వీరంతా ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరగాలా అని నిలదీశారు. వెంటనే ఎన్నికల సంఘం దీనిపై తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  పెన్షన్లు తీసుకునే అందరివద్దా మొబైల్ ఫోన్లు ఉండవని, వారికి పెన్షన్ వచ్చిందో రాదో ఎలా తెలుస్తుందని… విలేజ్ సెక్రటేరియట్ లో ఒక్కో ఉద్యోగి 45 మందికి మాత్రమే  ఇస్తారని.. ఈ అన్ని విషయాలనూ దృష్టిలో పెట్టుకొని ఇంటివద్దే పెన్షన్ అందించే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.

ఒక్కసారి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత అధికారులు ఎవరూ సిఎంకు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని, వారంతా ఎన్నికల సంఘం కిందే పని చేయాల్సి ఉంటుందని, సిఎం సెక్రటరీ ధనుంజయ రెడ్డికి పెన్షన్ల పంపిణీతో ఏం సంబంధం ఉందని అడిగారు.  జగన్ మోచేతి నీళ్ళు తాగే కొందరు అధికారులు, ఈ తరహా కుట్రలు, కుతంత్రాల్లో పాలు పంచుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో పంచాయతీ ఆఫీసులో ఇచ్చే పెన్షన్ ఇప్పుడు ఇంటికే వెళ్లి వస్తారని దానిలో ఇబ్బంది ఏముంటుందని ప్రశ్నించారు. గతంలో గ్రామ సచివాలయాల చుట్టూ తిప్పుకొని ఇప్పుడు బ్యాంకుల చుట్టూ తిప్పాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు.

ప్రజలకు విధేయులుగా ఉండాల్సిన అధికారులు ఒక వ్యక్తి, పార్టీ ప్రయోజనాలకు వత్తాసు పలకడం గర్హనీయమన్నారు. ఈసారి పెన్షన్ల పంపిణీ సందర్భంగా ఎవరైనా ప్రాణాలు కోల్పోతే దానికి యంత్రాంగం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్