వైఎస్ జగన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన యువతే ఆయన్ను గద్దె దించేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని కేంద్ర సమాచార, ప్రసార, క్రీడల శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. జగన్ యువతను అన్ని రకాలుగా మోసం చేశారని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. యువతకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనదని ఆరోపించారు. ఎన్నికలలో యువతకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయాలని, వెంటనే జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన యువ సంఘర్షణ యాత్ర ముగింపు సభ విజయవాడలో జరిగింది. ఈ సభకు అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మూడేళ్ళ కాలంలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పించాల్సింది పోయి ఉన్న పరిశ్రమలనే వెళ్ళగొట్టారన్నారు. రాష్ట్రంలో మద్యం, ల్యాండ్ మాఫియాలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాయని మండిపడ్డారు. దేవాలయాలు కాపాడడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఏపీలో తాము అధికారంలోకి వచ్చిన తరువాత దేవాలయాలు ఎలా కాపాడాలో చెబుతామన్నారు.