ఎసెన్షియా ఫార్మా భాధితులందరికీ వారంరోజుల్లో పరిహారం ఇవ్వాలని, లేకపోతే బాధితుల తరఫున వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని.. అవసరమైతే తాను కూడా ధర్నాలో పాల్గొంటానని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హెచ్చరించారు. ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తోందన్నారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగితే వేగంగా స్పందించామన్నారు. 24 గంటల్లోనే కోటి రూపాయల పరిహారం ప్రకటించి బాధిత కుటుంబాలకు అందించామన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రమాదం జరిగినా.. వైసీపీపై నింద వేయడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. నేడు అనకాపల్లిలో పర్యటించిన జగన్…ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలను, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
తమ ప్రభుత్వంలో ఇలాంటి ఘటన తెల్లవారుజామున జరిగితే.. 5 గంటల వరకు కలెక్టర్ స్పాట్ కు చేరుకున్నారని, కోటి రూపాయలు పరిహారం ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా తమదేనని అన్నారు. అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితులకు వెంటనే వైద్యం కూడా అందించలేకపోయారని విమర్శించారు. ఘటనా స్థలానికి కలెక్టర్లు, అధికారులు ఎవరూ వెళ్లలేదని, కనీసం అంబులెన్స్ కూడా పంపించలేదని, కంపెనీ బస్సుల్లోనే బాధితుల్ని ఆస్పత్రులకు తరలించారని ఆరోపించారు. ఇలాటి సమయాల్లో ఎలా పని చేయాలో తమ హయాంలోనే ఓ ప్రోటోకాల్ తీసుకొచ్చామని తెలిపారు.