వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 27 నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రను చేపడతారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి వెల్లడించారు. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర జరుగుతుందని, సిద్ధం బహిరంగసభలు నిర్వహించిన పరిధిలోని నాలుగు లోక్ సభ స్థానాలు మినహా మిగిలిన చోట్ల యాత్ర ఉంటుందని వివరించారు. పండుగలు, సెలవు రోజుల్లో యాత్రకు విరామం ఉంటుందని, కానీ జగన్ ఆయా ప్రాంతాల్లోనే బసచేస్తారని, అన్ని నియోజకవర్గాలూ పూర్తయ్యే వరకూ యాత్రలోనే ఉంటారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీలు తలశిల రఘురాం, లేళ్ళ అప్పిరెడ్డిలతో కలిసి సజ్జల మీడియాతో మాట్లాడారు.
జగన్ సభ అంటే తిరునాళ్ళలా ఉంటుందని, గతంలో ఎన్నడూ లేనంతగా సిద్ధం సభలు జరిగాయని , ఊళ్లకు ఊళ్ళు తరలి వచ్చారని…. అదే రీతిలో మేమంతా సిద్ధం సభలు కూడా పార్లమెంట్ స్థాయిలో భారీగా జరుగుతాయని సజ్జల పేర్కొన్నారు. యాత్రలో భాగంగా ఉదయం వివిధ వర్గాల ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారన్నారు.
తొలుత ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించి అనంతరం పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల మీదుగా ప్రొద్దుటూరుకు బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. 28న నంద్యాల, 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా సెలవు…30న ఎమ్మిగనూరులో సభ ఉంటుందన్నారు.