రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తేదీ సమయం వారు చెప్పినా సరే, తనను చెప్పమన్నా ఓకే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఛాలెంజ్ విసిరారు. రెండ్రోజుల క్రితం పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన అనంతరం షర్మిల చేసిన విమర్శలపై సుబ్బారెడ్డి స్పందించిన విషయం తెలిసిందే. నాలుగున్నరేళ్ళలో రాష్ట్రంలో ఏం అభివృద్ధి జరిగిందో చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్న వైవీ… వీటిపై షర్మిల నేడు స్పందించారు. తనతో పాటు మీడియా, ప్రతిపక్షాలు, మేధావులు కూడా అభివృద్ధి చూసేందుకు వస్తారని చెప్పారు. నేటి నుంచి జిల్లాల పర్యటన చేపట్టిన ఆమె ఇచ్చాపురం వెళుతూ మార్గమధ్యంలో కాన్వాయ్ ఆపి ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ప్రయాణికులతో మాటా మంతీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో కూడా మాతలాడారు.
“మీరు కట్టిన రాజధాని ఎక్కడ, మీరు కట్టిన పోలవరం ప్రాజెక్టు ఎక్కడ, మీరు చేసిన అభివృద్ధి చూడాలని ఏపీలో అందరూ కళ్ళలో వత్తులు వేసుకొని చూస్తున్నారు” అంటూ ప్రశ్నించారు. తాను జగన్ రెడ్డి గారు అంటూ మాట్లాడడం వైసీపీ నేతలకు ఇష్టం లేకపొతే ఇకపై జగనన్న గారు అని పిలుస్తానంటూ ఎద్దేవా చేశారు. సిఎం జగన్ ఆ పార్టీ ఎంపీలు బిజెపికి ఊడిగం చేస్తున్నారని, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా మాట్లాడడం లేదని, ఆ పార్టీకి బానిసలుగా మారారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రారాజన్న బిడ్డగా మీ ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.