కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల నేడు హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఫిబ్రవరి 17న జరిగే తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి బాబును షర్మిల ఆహ్వానించారు.
చంద్రబాబు ఎన్నో పాత విషయాలు తనకు చెప్పారని, వైఎస్సార్ తో ఉన్న స్నేహం గురించి చాలా సేపు చర్చ జరిగిందని, వైఎస్సార్ గురించి చాలా గొప్పగా చెప్పారని షర్మిల ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రాజకీయ జీవితంలో వైఎస్సార్ తో ఉన్న అనుభవాలు పంచుకున్నారని చెప్పారు. చంద్రబాబు ను కలవడాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదబని, గతంలో తన తండ్రి డా. వైఎస్సార్ ఆహ్వానం మేరకు మా పెళ్లిళ్లకు చంద్రబాబు వచ్చి దీవించారని షర్మిల గుర్తు చేశారు. తమకు రాజకీయంగా ఎటువంటి లావాదేవీలు లేవని కేవలం పెళ్ళికి వచ్చి ఆశీర్వదించాలని కోరానని చెప్పారు.
దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని, అందుకే తన పార్టీని అందులో విలీనం చేశానని, పార్టీ తనకు ఏ భాద్యతలు ఇచ్చినా నిర్వర్తిస్తానని, రాహుల్ గాంధీని ప్రధాని చేసుకోవాలన్న డా. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని స్పష్టం చేశారు.
ప్రజలకోసం తాము పని చేసేందుకు రాజకీయ రంగంలోకి వచ్చామని, కానీ అదే జీవితం కాదని, అదో వృత్తి మాత్రమేనని, ఈ క్రమంలో ఒకరినొకరం ని మాటలు అనుకుంటామని, తాము కేవలం రాజకీయ ప్రత్యర్ధులం మాత్రమేనని, అంతిమంగా అందరం ప్రజల కోసమే పని చేయాలసి ఉంటుందని చెప్పారు. పండుగకో, లేదా పెళ్లికి ఆహ్వానం, కేకు లాంటివి పంపిస్తే తప్పు పట్టాల్సిన అవసరం లేదన్నారు.