తెలంగాణా ప్రజలందరి అభివృద్ధి, సంక్షేమం కోసమే పార్టీ పెడుతున్నామని, తెలంగాణ ఆకాంక్షలకు అద్దం పట్టేలా, వైఎస్సార్ సంక్షేమ పాలన మళ్ళీ తెచ్చేలా తమ పార్టీ ఉంటుందని వైఎస్ షర్మిల వెల్లడించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జన్మదినం అయిన జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణ’ పార్టీ ఆవిర్భావం సందర్భంగా ౩౩ జిల్లాల కార్యకర్తలతో సన్నాహక సమావేశం లోటస్ పాండ్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షర్మిల ముఖ్య నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు.
తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన అందని గడప లేదని,. తాకని గుండె లేదని, అయన వల్ల లబ్ధి పొందని ఇల్లు లేదని పేర్కొన్నారు. తమ పార్టీలో కార్యకర్తలే కీలకమని, వారికే పెద్ద పీటవేస్తామని…. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పరితపించే కార్యకర్తలే తమ పార్టీలో రేపటి ప్రజా నాయకులని ప్రకటించారు. ప్రజల నాడిని అతి దగ్గరగా వినేది కార్యకర్తలే కాబట్టి వారు చెప్పేదే మన పార్టీ సిద్ధాంతం కావాలని, వారు చెప్పిందే మన పార్టీ రాజ్యాంగం కావాలని షర్మిల నిర్దేశించారు.
ఈ నెలరోజుల్లో పార్టీ ముఖ్య కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుకొని, వాళ్ల ఆకాంక్షలు ఏమిటో తెలుసుకొని, వారికి ఎలాంటి పాలన అందించాలో తెలుసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.
కార్యకర్తలంటే కేవలం జెండాలు మోసేవారే కాదని, జనం గుండె చప్పుడు విని వాటిని అజెండాలో రాయగలిగే వారని తన నమ్మకమని షర్మిల అన్నారు. కార్యకర్తలంటే జానాల్ని తరలించేవారే కాదని, నాయకుడి వద్దకు జనం గొంతు చేర్చేవారని, ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి వాటి పరిష్కారం కోసం పోరాడేవారే పార్టీ కార్యకర్తలని అబిప్రాయపడ్డారు. కార్యకర్తలంటే ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలు కూడా అని తన తండ్రి వైఎస్ ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేసుకున్నారు షర్మిల.